Telugu Global
Telangana

మెదక్ సీటుపై రేవంత్ రెడ్డి ఫోకస్.. ఎందుకంటే..?

మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంది. పటాన్ చెరు, సంగారెడ్డిలో బీజేపీకి ఓటుబ్యాంకు ఉంది. దీంతో మెదక్ సీటు కాంగ్రెస్ కి కీలకంగా మారింది.

మెదక్ సీటుపై రేవంత్ రెడ్డి ఫోకస్.. ఎందుకంటే..?
X

మెదక్ పార్లమెంట్ స్థానం అధికార కాంగ్రెస్ కి కొరకరానికొయ్యలా మారింది. కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయం అనుకునే స్థానం, లేదా కాంగ్రెస్ కి చుక్కలు చూపించే స్థానం మెదక్ అని తేలిపోయింది. అందుకే ఈ పార్లమెంట్ సీటుపై సీఎం రేవంత్ రెడ్డి స్పెషల్ ఫోకస్ పెట్టారు. తాజాగా ఆయన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గ కాంగ్రెస్ నేతలతో సమావేశమయ్యారు. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా ప్రచార ప్రణాళికలు రూపొందించి ప్రజల్లోకి వెళ్లాలని, పోలింగ్‌ బూత్ స్థాయి నుంచే ఓట్లు వేయించుకునే వ్యూహంతో ముందుకెళ్లాలని స్థానిక నేతలకు సూచించారు రేవంత్ రెడ్డి. పార్లమెంటు ఎన్నికల తరవాత స్థానిక సంస్థల ఎన్నికలు వస్తాయని, పార్టీని గ్రామస్థాయి నుంచి బలోపేతం చేయాలంటే ముందు పార్లమెంటు ఎన్నికల్లో బలం నిరూపించుకోవాలని ఉపదేశించారు.

మెదక్ లో కాంగ్రెస్ కి చేదు అనుభవం..

మెదక్ పార్లమెంట్ పరిధిలోకి వచ్చే అసెంబ్లీ స్థానాలు 7

కాంగ్రెస్ గెలిచినవి 1

బీఆర్ఎస్ ఖాతాలో ఉన్నవి 6

ఈ ఈక్వేషన్లు చూస్తే ఇక్కడ ఎవరి బలం ఎంతో ఈజీగా తేలిపోతుంది. కానీ లోక్ సభ ఎన్నికల నాటికి బీఆర్ఎస్ ని ఎలాగైనా బలహీనం చేసి ఆ మెదక్ సీటు కాస్తా తమ ఖాతాలో వేసుకోవాలని చూస్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి. మెదక్ లో బీఆర్ఎస్ ని ఓడిస్తే.. హరీష్ రావుని కూడా దెబ్బకొట్టినట్టు అవుతుందనేది ఆయన ఆలోచన. గతంలో మెదక్ నుంచి కేసీఆర్ కూడా ఎంపీగా ఎన్నికయ్యారు. గతంలో ఇదే పార్లమెంట్ స్థానం నుంచి ఇందిరా గాంధీ కూడా గెలిచారు. అందుకే ఇది హాట్ సీట్ గా మారింది.

మెదక్ లోక్ సభ స్థానానికి కాంగ్రెస్ తరపున నీలం మధు పోటీ పడుతున్నారు. బీఆర్ఎస్ సిట్టింగ్ ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దుబ్బాక ఎమ్మెల్యేగా గెలవడంతో.. ఆయన స్థానంలో వెంకట్రామిరెడ్డిని బరిలో దింపారు కేసీఆర్. ఈ రెండు పార్టీల మధ్య పోరు ఆసక్తికరంగా మారింది. బీజేపీ అభ్యర్థి రఘునందన్ రావుకి గెలిచే అవకాశం లేకపోయినా ఓట్లు గణనీయంగా చీల్చ గలరు. దీంతో కాంగ్రెస్ ఈ సీటుపై మరింత ఫోకస్ పెట్టింది. మెదక్ అసెంబ్లీ స్థానంలో కాంగ్రెస్ గెలిచింది అనుకున్నా.. అక్కడ బీఆర్ఎస్ ని తక్కువ అంచనా వేయలేం. అంటే మొత్తం ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో బీఆర్ఎస్ బలంగా ఉంది. పటాన్ చెరు, సంగారెడ్డిలో బీజేపీకి కూడా ఓటుబ్యాంకు ఉంది. దీంతో మెదక్ సీటు కాంగ్రెస్ కి కీలకంగా మారింది.

మెదక్ పరిధిలోని నేతలంతా ఈ ఎన్నికల్లో కలసికట్టుగా పనిచేయాలన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో అమలు చేస్తున్న కాంగ్రెస్ పథకాలను విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని సూచించారు. ప్రతి అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఐదుగురు నేతలతో సమన్వయ కమిటీని ఏర్పాటుచేసుకోవాలని చెప్పారు. మొత్తమ్మీద ఈసారి మెదక్ సీటుపై ప్రత్యేకంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోకస్ పెంచారు.

First Published:  4 April 2024 7:46 AM IST
Next Story