బడాబాబులు, సెలబ్రిటీలు.. ఎవర్నీ లెక్క చేయొద్దు
"ప్రభుత్వం మీ వెనక ఉంది, ఎలాంటి బడా బాబులు ఉన్నా ఉక్కుపాదం మోపండి" అని అధికారులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే పేరు వినపడితేనే వాటితో సంబంధం ఉన్న వారు వణికిపోవాలన్నారు.
డ్రగ్స్ కేసుల్లో సెలబ్రిటీలు ఉన్నా, ఎంత పెద్దవారు ఉన్నా కూడా ఉపేక్షించొద్దని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అవసరమైతే మాదకద్రవ్యాల నిరోధక బృందాలను ఏర్పాటు చేయాలని ఆయన అధికారులకు సూచించారు. సీఎస్, డీజీపీతో కలసి పలు విభాగాలపై సమీక్ష నిర్వహించిన రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో తీసుకుంటున్న చర్యలు, పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.
సరిహద్దుల్లో నిఘా..
రాష్ట్రంలోకి గంజాయి, మాదక ద్రవ్యాలు.. ఇతర రాష్ట్రాలనుంచి, ప్రాంతాలనుంచి వస్తున్నాయని, వాటిని అరికట్టేందుకు సరిహద్దుల్లో నిఘా పెట్టాలన్నారు రేవంత్ రెడ్డి. అనుమానిత ప్రాంతాల్లో ప్రత్యేక డ్రైవ్‌లు చేపట్టాలన్నారు. డ్రగ్స్ సరఫరా చేయాలంటేనే భయపడేలా కఠినంగా వ్యవహరించాలన్నారు. "ప్రభుత్వం మీ వెనక ఉంది, భయపడకండి, ఎలాంటి బడా బాబులు ఉన్నా ఉక్కుపాదం మోపండి" అని అధికారులకు భరోసా ఇచ్చారు రేవంత్ రెడ్డి. డ్రగ్స్ అనే పేరు వినపడితేనే వాటితో సంబంధం ఉన్న వారు వణికిపోవాలన్నారు. తెలంగాణను డ్రగ్స్ రహిత రాష్ట్రంగా మార్చేందుకు ప్రణాళికలు రూపొందించాలన్నారు. యాంటీ నార్కోటిక్ బ్యూరో.. ఇతర రాష్ట్రాలకు ఆదర్శంగా నిలవాలని ఆకాంక్షించారు రేవంత్ రెడ్డి.
కోడ్ ముగిశాక..
విపత్తు నిర్వహణపై కూడా సీఎం రేవంత్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఎన్నికల కోడ్ ముగిసిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహిస్తానన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించే వారిని వదిలిపెట్టేది లేదన్నారు. హైదరాబాద్ లో ఓపెన్ సెల్లార్ గుంతల వద్ద ముందుజాగ్రత్తగా బారికేడింగ్ ఉంచాలన్నారు. ప్రమాదాలు పునరావృతం కాకుండా చూడాలన్నారు రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ప్రతిష్ఠ దెబ్బతీసేలా వ్యవహరిస్తే సహించేది లేదన్నారు. చిన్న వర్షాలకే వరదనీరు వచ్చే ప్రాంతాలు, వరద ప్రభావం ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపట్టాలన్నారు . హైదరాబాద్ కి సంబంధించి వివిధ విభాగాలను ఒకే గొడుగు కిందకు తెస్తూ విపత్తు నిర్వహణ వ్యవస్థ రూపొందించాలన్నారు రేవంత్ రెడ్డి.