Telugu Global
Telangana

ప్రజా పాలనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు.

ప్రజా పాలనపై సీఎం రేవంత్ కీలక నిర్ణయం..
X

ప్రజా పాలనకు నాంది పలికారు సీఎం రేవంత్ రెడ్డి. ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు రాష్ట్రవ్యాప్తంగా ప్రజాపాలన కార్యక్రమం నిర్వహించాలని అధికారులకు ఆదేశాలిచ్చారు. సెక్రటేరియేట్‌ లో వివిధ జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. పేదలు, అట్టడుగు వర్గాల ప్రజలకు ప్రభుత్వ ఫలాలు దక్కేలా పాలన యంత్రాంగాన్ని గ్రామస్థాయిలోకి తీసుకెళ్లడమే ఈ పథకం లక్ష్యమని వివరించారు.

ప్రజా పాలన ఎలా..?

క్షేత్ర స్థాయిలో సమస్యలు తెలుసుకుని, వీలైనంత మేర అక్కడికక్కడే వాటిని పరిష్కరించడం ప్రజాపాలన కార్యక్రమం విధి. తొలి విడతగా ఈనెల 28 నుంచి జనవరి 6 వరకు ఈ కార్యక్రమం చేపట్టబోతున్నారు. ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని గ్రామపంచాయతీలు, మున్సిపల్‌ వార్డుల్లో గ్రామసభలు చేపడతారు. గ్రామ సభలు జరిగే సమయంలో అధికార బృందాలు ఆయా ప్రాంతాల్లో పర్యటిస్తాయి. ఈ కార్యక్రమానికి సర్పంచ్‌, స్థానిక కార్పొరేటర్‌, కౌన్సిలర్లు, ఇతర ప్రజా ప్రతినిధులు పాల్గొంటారు. గ్రామసభల్లో వచ్చిన ప్రతి దరఖాస్తుకు ఒక నెంబర్ ఇచ్చి వాటిని డిజిటలైజ్ చేస్తారు.

ఆరు గ్యారెంటీలు కూడా అప్పుడే..

ఆరు గ్యారంటీలకు సంబంధించి ఈనెల 28 నుంచి జనవరి 6వరకు జరిగే ప్రజా పాలన కార్యక్రమంలోనే దరఖాస్తులు స్వీకరిస్తారు. ఆరు గ్యారంటీలకు సంబంధించిన దరఖాస్తులను ముందుగా ప్రజలకు అందిస్తారు, పూర్తి చేసిన దరఖాస్తులను ప్రజా పాలన జరిగే సమయాల్లో గ్రామసభల్లో స్వీకరిస్తారు. దరఖాస్తులు ఇచ్చిన తర్వాత అధికారులు ఒక రసీదు ఇస్తారు. దరఖాస్తుల స్వీకరణ పూర్తయిన తర్వాత వారు ఏ పథకానికి అర్హులో అధికారులు నిర్ణయిస్తారు.

తమది ఉద్యోగుల ఫ్రెండ్లీ ప్రభుత్వమని చెప్పారు సీఎం రేవంత్‌ రెడ్డి. ప్రజాప్రతినిధులు, అధికారులు జోడెద్దుల్లా పనిచేయాలని ఆయన పిలుపునిచ్చారు. వారిద్దరి మధ్య సమన్వయం లేకపోతే అనుకున్న లక్ష్యం దిశగా వెళ్లలేమన్నారు. నిర్ణయాలను క్షేత్రస్థాయిలో అమలు చేయాల్సింది అధికారులేనన్నారు సీఎం రేవంత్ రెడ్డి. అభివృద్ధి అంటే అద్దాల మేడలు, రంగుల గోడలు కాదన్నారు. పేదలందరికీ సంక్షేమం అందితేనే అభివృద్ధి అని వివరించారు. రాష్ట్ర ప్రజలు అన్నింటినీ సహిస్తారు కానీ, వారి స్వేచ్ఛను హరిస్తే ఊరుకోరని.. ఎంతటివారైనా ఇంటికి పంపే చైతన్యం రాష్ట్ర ప్రజల్లో ఉందని వ్యాఖ్యానించారు రేవంత్ రెడ్డి.

First Published:  24 Dec 2023 6:33 PM IST
Next Story