కవిత అరెస్ట్ పై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అన్నారు. తమ పరిపాలన చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి.
ఎమ్మెల్సీ కవిత అరెస్ట్ తర్వాత కాంగ్రెస్ కీలక నేతలెవరూ ఇప్పటి వరకు స్పందించలేదు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి ఈ అరెస్ట్ పై స్పందించారు. కవిత అరెస్ట్ సీరియల్ లాగా సాగిందని చెప్పారు. అరెస్ట్‌తో ఈ డ్రామా పతాక స్థాయికి చేరిందన్నారు. సానుభూతి కోసం బీజేపీ, బీఆర్ఎస్ పాకులాడుతున్నాయని అన్నారు. కవిత అరెస్ట్ పై ఆమె తండ్రిగా కేసీఆర్ ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి. తెలంగాణకు ఈడీ, మోదీ కలిసే వచ్చారన్నారు. మోదీ కూడా కవిత అరెస్ట్ పై ఎందుకు మాట్లాడలేదని అన్నారు రేవంత్ రెడ్డి. కాంగ్రెస్ ను దెబ్బతీయడానికి బీజేపీ, బీఆర్ఎస్ నాటకం ఆడుతున్నాయని విమర్శించారు.
మా జోలికొస్తే అంతే..
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పని చేసుకోనివ్వాలని, అలా చేసుకోనిస్తేనే ప్రతిపక్షం కూడా పని చేసుకోగలుగుతుందని అన్నారు రేవంత్ రెడ్డి. ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టాలని చూస్తే మాత్రం బీఆర్ఎస్ లో ఎవరూ మిగలరని హెచ్చరించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని బీఆర్ఎస్, బీజేపీ నేతలు అంటున్నారని.. బీఆర్ఎస్ ప్రభుత్వం వస్తుందని ఆ పార్టీ పెద్దలు ఎమ్మెల్యేలకు నమ్మబలుకుతున్నారని అన్నారు రేవంత్ రెడ్డి. ఏకంగా మంత్రి పదవుల పంపకం కూడా జరుగుతోందని ఎద్దేవా చేసారు. తనని కలవడానికి వచ్చిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తనకు ఈ వివరాలు చెప్పారని, కాంగ్రెస్ ని కూలదోయాలనుకునే ఆలోచన సరికాదన్నారు రేవంత్ రెడ్డి.
ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవించి చిత్తశుద్ధితో పరిపాలన ముందుకి తీసుకెళ్తున్నాము.
— Telangana Congress (@INCTelangana) March 16, 2024
ఈ ప్రభుత్వాన్ని పడగొట్టే ఆలోచన చెస్తే, దాన్ని ఎలా ఎదుర్కోవాలో మా దగ్గర ప్రణాళిక ఉంది.
- ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు. pic.twitter.com/48AtumrrCj
మా పాలనపై రెఫరెండం..
తాము గేట్లు తెరిస్తే బీఆర్ఎస్ లో నలుగురైదుగురు కూడా మిగలరని మరోసారి స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. పార్లమెంట్ ఎన్నికలు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ పాలనకు రెఫరెండం అన్నారు. తమ పరిపాలన చూసి ఓటు వేయాలని ప్రజలను కోరుతున్నట్టు చెప్పారు రేవంత్ రెడ్డి. ఇష్టం వచ్చిన భాషలో తనని విమర్శించి ఇప్పుడు భాష గురించి నీతులు చెప్పడం సరికాదని అన్నారు. తమ వ్యూహాలు తమకు ఉన్నాయని, ఎలాంటి ఇబ్బంది వచ్చినా ధైర్యంగా ఎదుర్కొంటామని తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.