Telugu Global
Telangana

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ధర్నా

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ కూడా ధర్నాలో పాల్గొనడం విశేషం. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ధర్నాకు రావడం కూడా ఆసక్తికరం.

ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి తొలి ధర్నా
X

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు.. ధర్నాలు, ర్యాలీలు, ఆందోళనలు, నిరసన ప్రదర్శనలతో హోరెత్తిస్తుంటారు నాయకులు. అధికారంలోకి వచ్చాక అలాంటివాటికి సహజంగానే దూరంగా ఉంటారు. కానీ తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తొలిసారి ధర్నా చేపట్టబోతున్నారు. ఇండియా కూటమి ఆధ్వర్యంలో ఈరోజు జరిగే ధర్నాలో ఆయన పాల్గొంటారు. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ వద్ద ఈ ధర్నా జరుగుతుంది.

ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అధికార పార్టీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు చేపట్టారు, ధర్నాలు చేశారు. సీఎం అయ్యాక ఆయన తొలి ధర్నా ఇది. అది కూడా ఇందిరా పార్క్ వద్ద ఆయన ధర్నాలో పాల్గొనబోతుండటం విశేషం. పార్లమెంట్‌ లో విపక్ష పార్టీలకు చెందిన 146 మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఇండియా కూటమి దేశవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. ఇందులో భాగంగా హైదరాబాద్ లోని ఇందిరా పార్క్‌ వద్ద కూటమిలోని అన్ని పార్టీలు ధర్నా నిర్వహించడానికి సిద్ధమయ్యాయి. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు పలువురు మంత్రులు కూడా పాల్గొంటారు.

పార్లమెంట్‌లో సెక్యూరిటీ లోపాలపై ఇండియా కూటమి నిరసన తెలిపింది. ఈ దాడి పై ప్రధాని, హోం మంత్రి స్పందించాలని కూటమి డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో పార్లమెంట్ లో నిరసన తెలిపిన ఎంపీలను స్పీకర్ సస్పెండ్ చేయడం సంచలనంగా మారింది. మొత్తం 146మంది ఎంపీలను సస్పెండ్ చేయడంతో ఇండియా కూటమి ఆందోళన వ్యక్తం చేస్తోంది. దేశవ్యాప్తంగా ఈరోజు ధర్నాకు పిలుపునిచ్చింది.

అప్పట్లో కేసీఆర్ కూడా..

గతంలో బీఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు సీఎం హోదాలో కేసీఆర్ కూడా ధర్నాలో పాల్గొనడం విశేషం. ధాన్యం కొనుగోళ్లపై కేంద్ర ప్రభుత్వం తీరుకు నిరసనగా నాడు సీఎం కేసీఆర్ సహా మంత్రులు, ఇతర నాయకులు రోడ్డెక్కారు. నిరసన ప్రదర్శనలతో హోరెత్తించారు. ఇప్పుడు ఇందిరా పార్క్ వద్ద సీఎం హోదాలో రేవంత్ రెడ్డి ధర్నాకు రావడం కూడా ఆసక్తిగా మారింది.

First Published:  22 Dec 2023 4:24 AM GMT
Next Story