Telugu Global
Telangana

ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభం

తొలి వారం ఎటువంటి కార్డులు చూపించకపోయినా ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం స్థానికతను తెలిపే గుర్తింపు కార్డును కండక్టర్ కు చూపించవలసి ఉంటుంది.

ఉచిత బస్సు, ఆరోగ్యశ్రీ పథకాలు ప్రారంభం
X

మహిళలు, ట్రాన్స్ జెండర్ల కోసం ఉచిత బస్సు ప్రయాణ పథకాన్ని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ ప్రారంభించారు. అదేవిధంగా రాజీవ్ ఆరోగ్య శ్రీ పథకం లబ్ధిని రూ.10 లక్షలకు పెంచుతూ మరో పథకాన్ని కూడా ప్రారంభించారు. కాంగ్రెస్ అగ్ర నాయకురాలు సోనియా గాంధీ పుట్టిన‌రోజు సందర్భంగా ఈ రెండు పథకాలను ముఖ్యమంత్రి ప్రారంభించారు. ఎన్నికలకు ముందు కాంగ్రెస్ ఇచ్చిన ఆరు గ్యారంటీ పథకాల్లో ఈ రెండు పథకాలు కూడా ఉన్నాయి.

మహిళలకు ఉచిత ప్రయాణం

ఇవాల్టి నుంచి తెలంగాణలో మహిళలు, విద్యార్థినులు, బాలికలు, ట్రాన్స్‌జెండ‌ర్స్‌ సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ ప్రెస్, ఎక్స్ ప్రెస్, పల్లె వెలుగు బస్సుల్లో రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడినుంచి ఎక్కడికైనా ఉచితంగా ప్రయాణం సాగించవచ్చు. ఈ బస్సుల్లో మహిళలు ప్రయాణించాలంటే మహాలక్ష్మి కార్డు లేదా ఏదైనా గుర్తింపు కార్డు చూపించవలసి ఉంటుంది.

తొలి వారం ఎటువంటి కార్డులు చూపించకపోయినా ప్రయాణానికి అనుమతి ఇస్తారు. ఆ తర్వాత నుంచి మాత్రం స్థానికతను తెలిపే గుర్తింపు కార్డును కండక్టర్ కు చూపించవలసి ఉంటుంది. ఈ కార్డు చూపిన వెంటనే కండక్టర్ జీరో టికెట్ ఇస్తారు. ఒకవేళ తెలంగాణ సరిహద్దు దాటి ప్రయాణించవలసి వస్తే ఆ దూరానికి మాత్రం టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది. తెలంగాణలో మొత్తం 7,929 బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యాన్ని కల్పించారు.

First Published:  9 Dec 2023 2:42 PM IST
Next Story