Telugu Global
Telangana

హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు

FTL పరిధిలో కానీ, బఫర్ జోన్ లో కానీ.. తనకు చెందిన నిర్మాణాలు ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే తానే దగ్గరుండి కూల్చి వేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.

హైడ్రా కూల్చివేతలపై రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు
X

హైడ్రా కూల్చివేతలు ఆపేయాలని తీవ్ర ఒత్తిళ్లు వస్తున్నాయని, అయినా వాటిని ఎదుర్కొంటామని, వెనక్కి తగ్గేది లేదని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. సచివాలయంలో మీడియా చిట్ చాట్ లో ఆయన ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మాజీ మంత్రి హరీష్ రావు ఒప్పుకుంటే, ఆయన నేతృత్వంలోనే చెరువుల ఆక్రమణలపై నిజ నిర్థారణ కమిటీ వేస్తామని చెప్పారు. ప్రస్తుతానికి హైదరాబాద్ వరకే హైడ్రా పరిమితం అన్నారు రేవంత్ రెడ్డి.

ఫుల్ ట్యాంక్ లెవల్(FTL), బఫర్‌ జోన్‌ పరిధిలో ఎవరు నిర్మాణాలు చేసినా కూల్చివేస్తామని స్పష్టం చేశారు సీఎం రేవంత్ రెడ్డి. అసలు కూల్చివేతలు మొదలైందే కాంగ్రెస్ నేత నిర్మాణంతో అని గుర్తు చేశారు. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులు పల్లంరాజుకి చెందిన నిర్మాణాన్ని హైడ్రా మొదటిగా కూల్చివేసిందని చెప్పారు. 30 ఏళ్ల క్రితం నిర్మాణాలయినా హైడ్రా కూల్చి వేస్తుందని, అందులో అనుమానమేం లేదన్నారు. 30 ఏళ్లుగా చెరువు స్థలాన్ని కబ్జా చేసి నిర్మాణాలు చేపడితే చూసీ చూడనట్టు వదిలేయాలా అన్నారు. సీనియర్ కబ్జాదారుల్ని గౌరవించాలా అని ప్రశ్నించారు రేవంత్ రెడ్డి.

నేను కూడా రెడీ..

FTL పరిధిలో కానీ, బఫర్ జోన్ లో కానీ.. తనకు చెందిన నిర్మాణాలు ఉంటే కచ్చితంగా తానే దగ్గరుండి కూల్చి వేస్తానని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. గతంలో కొంతమంది కాంగ్రెస్ నేతలు కూడా ఇవే వ్యాఖ్యలు చేశారు. నిరూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తామన్నారు. సీన్ కట్ చేస్తే ఆ సవాల్ చేసిన నేతలకు చెందిన భవనాలు కూడా FTL పరిధిలో ఉన్నట్టు తేలింది. ఇప్పుడు సీఎం రేవంత్ రెడ్డి కూడా అవే డైలాగులు రిపీట్ చేశారు. తనకు, తన కుటుంబానికి ఎలాంకి అక్రమ నిర్మాణాలు లేవన్నారాయన. ఉన్నాయని ఎవరైనా నిరూపిస్తే దగ్గరుండి కూల్చివేయిస్తానన్నారు. విద్యా సంస్థల ముసుగులో కబ్జా చేస్తే చూస్తూ ఊరుకోబోమని హెచ్చరించారు రేవంత్ రెడ్డి.

First Published:  28 Aug 2024 10:23 AM GMT
Next Story