Telugu Global
Telangana

MIMతో కాంగ్రెస్ దోస్తీ..!

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే MIMతో కాంగ్రెస్‌ స్నేహం కోరుకుంటుందన్న ప్రచారం మొదలైంది.

MIMతో కాంగ్రెస్ దోస్తీ..!
X

సీఎం రేవంత్ రెడ్డి ఇప్పుడు మజ్లిస్‌ను మచ్చిక చేసుకునే పనిలో ఉన్నారా.. అంటే అవుననే సమాధానమే వస్తోంది. ఎన్నికల ముందు నాటి వైరాన్ని మరిచి MIMకు స్నేహహస్తాన్ని చాస్తున్నారు. మంగళవారం మజ్లిస్ ఫ్లోర్‌ లీడర్ అక్బరుద్దీన్‌ నేతృత్వంలోని MLAల బృందంతో రేవంత్ సమావేశమయ్యారు. మూసీ నది తీరాన్ని ఉపాధి, ఆదాయ వనరుగా మార్చే ప్రణాళికలకు మద్దతు ఇవ్వాలని MIM నేతలను కోరారు. ఈ సమావేశానికి మంత్రులు మల్లు భట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, దామోదర రాజనర్సింహ సైతం హాజరయ్యారు.

ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ నియమించాలని నిర్ణయం తీసుకున్నప్పుడే MIMతో కాంగ్రెస్‌ స్నేహం కోరుకుంటుందన్న ప్రచారం మొదలైంది. అక్బరుద్దీన్‌ను ప్రొటెం స్పీకర్‌గా నియమించడాన్ని బీజేపీ ఎమ్మెల్యేలు తప్పు పట్టి ప్రమాణస్వీకారానికి సైతం దూరంగా ఉన్నారు. ఇక రేవంత్ రెడ్డి తీసుకున్న మరో నిర్ణయం కూడా హాట్‌ టాపిక్‌గా మారింది. ముఖ్యమంత్రి సెక్రటరీగా మైనారిటీ వర్గానికి చెందిన షానవాజ్‌ ఖాసీంను నియమించి ఆయన ఆశ్చర్యపరిచారు. షానవాజ్‌ ఖాసీంకు వక్ఫ్‌ భూములపై లోతైన అవగాహన ఉందని సమాచారం.

ఇటీవల జ‌రిగిన అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్‌, రంగారెడ్డి జిల్లాల్లో కాంగ్రెస్‌కు పెద్దగా సీట్లు రాలేదు. లోక్‌సభ ఎన్నికలు, GHMC ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని MIM, మైనార్టీ వర్గాలను దగ్గర చేసుకునే ప్రయత్నం చేస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో భాగంగానే MIMతో సయోధ్యకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక అసెంబ్లీలోనూ కాంగ్రెస్‌కు బొటాబొటీ మెజార్టీ మాత్రమే ఉంది. మిత్రపక్షంతో కలిపి 65 మంది సభ్యులు మాత్రమే ఉన్నారు. దీంతో భవిష్యత్తులో ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా MIM సపోర్ట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ప్రస్తుతం మజ్లిస్‌కు అసెంబ్లీలో ఏడుగురు సభ్యుల బలం ఉంది. కాగా, ఇప్పటివరకు ఓవైసీ సోదరులు బీఆర్ఎస్‌తో తమ ఫ్రెండ్షిప్ కొనసాగుతుందని ప్రకటనలు చేశారు. తాజా పరిణామాల నేపథ్యంలో బీఆర్ఎస్‌తోనే ఉంటారా.. లేక కాంగ్రెస్‌ వైపు మొగ్గు చూపుతారా అనేది తేలాల్సి ఉంది.

First Published:  13 Dec 2023 8:07 AM IST
Next Story