Telugu Global
Telangana

ఒకే క్యాంపస్ లో అన్ని గురుకులాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం

కులాల మధ్య అంతరాలు చెరిపేందుకే ఈ ప్రయత్నం అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ముందుగా కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపడుతున్నామని, శంకుస్థాపన చేస్తామని చెప్పారు.

ఒకే క్యాంపస్ లో అన్ని గురుకులాలు.. సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం
X

బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సంబంధించి అన్ని వర్గాలకు గురుకులాలు ఉన్నా కూడా అవి వేటికవే విడివిడిగా ఉంటాయి. కానీ వాటన్నిటినీ కలిపి ఒకేచోట ఉండేలా ఏర్పాటు చేస్తామని చెప్పారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. కులాల మధ్య అంతరాలు చెరిపేందుకే ఈ ప్రయత్నం అని అన్నారాయన. ముందుగా కొడంగల్ లో పైలట్ ప్రాజెక్ట్ గా దీన్ని చేపడుతున్నామని, శంకుస్థాపన చేస్తామని చెప్పారు. డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ భవన్ ప్రారంభోత్సవ సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.


ఇందిరమ్మ కాలనీల్లో కూడా..

ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపుల్లో కూడా కులాల మధ్య అంతరాలు చెరిపేయాలనుకుంటున్నట్టు తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి. దళితులు, గిరిజనులు, బీసీలు, మైనార్టీలందరూ ఒకేచోట ఉండేలా ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని తాను అధికారులను ఆదేశించానని చెప్పారు. అన్ని కులాల వారు ఐకమత్యంగా ఉంటేనే అందరూ సంతోషంగా ఉంటారని, రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని అన్నారు రేవంత్ రెడ్డి.

చదువుమీద పెట్టేది ఎప్పటికీ ఖర్చు కాదని, అది భవిష్యత్తుకు పెట్టుబడి అని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బాగా చదువుకుంటేనే ఉన్నత శిఖరాలను అధిరోహించగలమని అన్నారు. ఆర్‌ఎస్ ప్రవీణ్ కుమార్, ఆకునూరి మురళి లాంటి వారికి చదువు వల్లే గుర్తింపు, గౌరవం వచ్చాయన్నారు రేవంత్ రెడ్డి. కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదని, ఒకసారి దొరల చేతిలో ఉంటే, ఒకసారి దళితుల చేతుల్లో ఉంటుందని అన్నారు. దొరలకు ఇష్టం ఉన్నా లేకున్నా అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ ని అధ్యక్షా.. అని పిలవాల్సిందేనని చెప్పారు. ప్రశ్నించే హక్కును, అధికారాన్ని ప్రజలకు కల్పించింది కాంగ్రెస్ పార్టీయేనని వివరించారు సీఎం రేవంత్ రెడ్డి.

First Published:  7 March 2024 7:46 PM IST
Next Story