Telugu Global
Telangana

తెలంగాణలో ఐటీఐ చదివితే టాటా కంపెనీలో ఉద్యోగాలు

చిన్న చిన్న ఉద్యోగాలకోసం విదేశాలకు వలస వెళ్లకుండా యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందిస్తామన్నారు.

తెలంగాణలో ఐటీఐ చదివితే టాటా కంపెనీలో ఉద్యోగాలు
X

టెన్త్ సప్లిమెంటరీలో పాసయితే ఐటీఐ, ఇంటర్ లో కష్టపడలేరనుకుంటే ఐటీఐ.. ఇప్పటి వరకు పరిస్థితి ఇలా ఉండేది. కానీ పెద్ద సంస్థల్లో ఉద్యోగం కావాలంటే ఐటీఐ చదివినా సరిపోతుందని అంటున్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇకపై తెలంగాణలో ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్ స్టిట్యూట్ (ఐటీఐ)లను అడ్వాన్స్ డ్ ట్రైనింగ్ సెంటర్లు(ఏటీసీ)గా అప్ గ్రేడ్ చేస్తున్నట్టు తెలిపారు. ఇక్కడ చదువుకున్నవారికి టాటా కంపెనీలో ఉద్యోగాలిప్పిస్తామన్నారు. తెలంగాణలో తొలి ఏటీసీకి మల్లేపల్లి ఐటీఐలో శంకుస్థాపన చేశారు రేవంత్ రెడ్డి.


అప్ గ్రెడేషన్ ఇలా..

ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు టాటా టెక్నాలజీస్ లిమిటెడ్(టీటీఎల్)తో అవగాహన ఒప్పందం..

ప్రాజెక్ట్ వ్యయంలో రాష్ట్ర ప్రభుత్వ వాటా రూ.307.96 కోట్లు

టీటీఎల్‌ వాటా రూ.2016.25 కోట్లు

ప్రతి ఏటా 15, 860 మందికి 6 రకాల కోర్సుల్లో లాంగ్‌టర్మ్‌ కోచింగ్‌

31,200 మందికి 23 రకాల కోర్సుల్లో షార్ట్‌ టర్మ్‌ కోచింగ్

ఏటీసీల్లో శిక్షణ పొందిన వారికి టీటీఎల్‌ లో ఉద్యోగాలు

క్లుప్తంగా ఈ ప్రాజెక్ట్ వివరాలివి. తెలంగాణలో ఐటీఐలను ఏటీసీలుగా మార్చేందుకు మొత్తం రూ.2,324.21 కోట్ల నిధులు ఖర్చుచేయబోతోంది ప్రభుత్వం. ఆధునిక పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా వాటిలో యువతకు శిక్షణ ఇవ్వబోతున్నారు. ఏటీసీల్లో శిక్షణ ఇచ్చేందుకు 130 మంది నిపుణులను కూడా ప్రభుత్వం నియమించింది. రాష్ట్రంలోని మొత్తం 65 ఐటీఐలను ఇలా అధునాతనంగా తీర్చిదిద్దబోతున్నారు.

చిన్న చిన్న ఉద్యోగాలకోసం విదేశాలకు వలస వెళ్లకుండా యువతకు ఇక్కడే ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. రోబోలు మొదలుకొని అత్యాధునిక యంత్రాలు తీసుకొచ్చి యువతకు శిక్షణ అందిస్తామన్నారు. ముఖ్యమంత్రిగా ప్రత్యేకంగా దీనిపై దృష్టి సారిస్తానని, నెలకోసారి సమీక్ష నిర్వహిస్తానని తెలిపారు రేవంత్ రెడ్డి.

First Published:  18 Jun 2024 5:29 PM IST
Next Story