కేబినెట్ భేటీ కోసం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం..
సోమవారం వరకు ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికీ అనుమతి రాకపోతే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు.
తెలంగాణలో లోక్ సభ ఎన్నికలు పూర్తయిన వెంటనే కేబినెట్ మీటింగ్ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ప్రయత్నాలు చేసింది. అయితే ఎలక్షన్ కోడ్ ముగియలేదనే కారణంతో ఎన్నికల కమిషన్ ఆ మీటింగ్ కి అనుమతివ్వలేదు. చివరి నిమిషంలో ఈసీ షాకివ్వడంతో సీఎం రేవంత్ రెడ్డి కూడా అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ విషయాన్ని ఆయన ఇక్కడితో వదిలేలా లేరు. ఈసీ అనుమతి ఇవ్వకపోతే మంత్రుల బృందాన్ని ఢిల్లీకి పంపించాలనుకుంటున్నారు రేవంత్ రెడ్డి.
రాష్ట్రంలో సత్వరం పరిష్కరించాల్సిన సమస్యలు చాలా ఉన్నాయని, వాటి గురించి చర్చించేందుకు మంత్రివర్గ సమావేశం నిర్వహించాలని చెబుతున్నారు కాంగ్రెస్ నేతలు. కేబినెట్ భేటీ ఆలస్యమయితే సమస్యల పరిష్కారం మరింత ఆలస్యమవుతుందన్నారు. ఈసీ అనుమతి ఇస్తుందనే నమ్మకంతోనే నిన్న కేబినెట్ భేటీకి ఏర్పాట్లు జరిగాయి. శనివారం మధ్యాహ్నం నుంచి సచివాలయంలోనే రాష్ట్ర మంత్రులు ఎదురు చూశారు. కానీ ఈసీ అనుమతి ఇవ్వకపోవడంతో.. రాత్రి 7 గంటలకు వారంతా వెనుదిరిగారు.
ఎన్నికల సంఘం అనుమతి ఇస్తుందనే నమ్మకంతో ఉన్నారు కాంగ్రెస్ నేతలు. సోమవారం వరకు ఈసీ అనుమతి కోసం ఎదురు చూస్తామని, అప్పటికీ అనుమతి రాకపోతే మంత్రివర్గమే ఢిల్లీకి వెళ్లి ఈసీని కలుస్తుందని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. అయితే మంత్రులు ఢిల్లీకి ఎప్పుడు వెళ్తారనే విషయంలో మాత్రం ఆయన క్లారిటీ ఇవ్వలేదు. రైతు సంక్షేమం, రుణ మాఫీ, ధాన్యం కొనుగోళ్లు, ఖరీఫ్ పంట ప్రణాళిక, నిధుల సమీకరణ, జూన్ 2న రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం వంటి అంశాలపై మంత్రివర్గంలో చర్చించాలనుకున్నామని వెల్లడించారు సీఎం రేవంత్ రెడ్డి. ఎన్నికల సంఘం అనుమతివ్వక పోవడంతో ముఖ్యమైన సమస్యలపై చర్చించే అవకాశం లేకుండా పోయిందని చెప్పారు.