తాతకు దగ్గు నేర్పినట్టు.. గుండు, అరగుండు.. రెచ్చిపోయిన రేవంత్ రెడ్డి
తాతకు దగ్గు నేర్పినట్టు.. కొత్తకొత్తోళ్లు తయారయ్యారు. బతుకమ్మ, బోనాల కుండలు కవితమ్మే నేర్పినట్లు.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి.. బండి సంజయో, అర్విందో, గుండో- అరగుండో మనకు నేర్పినట్లు వ్యవహరిస్తున్నారు.
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ గెలుపు సెమీ ఫైనల్స్ మాత్రమే అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేపు జరిగే లోక్‌సభ ఎన్నికలే ఫైనల్స్ అన్నారు. హైదరాబాద్‌లో పార్టీ సోషల్ మీడియా వారియర్లతో సమావేశమైన ఆయన.. ప్రధాని మోడీ, మాజీ సీఎం కేసీఆర్‌లపై తీవ్ర విమర్శలు చేశారు. "సెమీ ఫైనల్స్‌లో కేసీఆర్‌ను ఓడించాం. అంటే సెమీ ఫైనల్స్‌లో బంగ్లాదేశ్‌ను ఓడించాం. ఇప్పుడు ఫైనల్స్‌లో మనం పాకిస్థాన్‌తో కొట్లాడాలి. మోడీ, అమిత్‌షా, నడ్డా సహా చాలా మంది నాయకులు మనల్ని ఓడించాలని తెలంగాణ మీద ముప్పేట దాడి చేస్తున్నారు. సొంత మనుషులనే కాకుండా కిరాయి మనుషుల్ని వాడుకుని తప్పుడు వార్తలు ప్రచారం చేస్తున్నారు. మతం, ప్రభుత్వ ఏజెన్సీలను ఉపయోగించుకుని లబ్ధి పొందాలని చూస్తున్నారు. ఆ తప్పుడు ప్రచారాన్ని తిప్పి కొట్టాలి. బీజేపీ వస్తే రిజర్వేషన్లను రద్దు చేస్తుంది. దీన్ని జనాల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి" అన్నారు రేవంత్ రెడ్డి.
దేవుళ్లను మొక్కకుండానే ఇంత దూరం వచ్చామా..?
బీజేపీ వాళ్లతోనే మనకు దేవుళ్లు మొక్కడం తెలిసినట్లు బిల్డప్ ఇస్తున్నారని కమలం పార్టీపై ఫైర్ అయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. "శ్రీరామనవమి అనగానే బీజేపీ వాళ్లు ఏదో సమస్యలా చిత్రీకరిస్తున్నారు. మన తాతలు, తండ్రులు శ్రీరామనవమి, హనుమాన్ జయంతి చేసుకోకుండానే.. పోచమ్మకు, మైసమ్మకు, ఎల్లమ్మకు కోడి కొయ్యకుండానే, కల్లు సాక పోయకుండానే మనం ఇంత దూరం వచ్చామా?. తాతకు దగ్గు నేర్పినట్టు.. కొత్తకొత్తోళ్లు తయారయ్యారు. బతుకమ్మ, బోనాల కుండలు కవితమ్మే నేర్పినట్లు.. శ్రీరామనవమి, హనుమాన్ జయంతి.. బండి సంజయో, అర్విందో, గుండో- అరగుండో మనకు నేర్పినట్లు వ్యవహరిస్తున్నారు. దేవుడు గుడిలో ఉండాలి, భక్తి గుండెల్లో ఉండాలి" అంటూ బీజేపీకి కౌంటరిచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.