Telugu Global
Telangana

మేడిగడ్డపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు

మేడిగడ్డ విషయంలో జరిగిన నష్టం.. 32 పళ్లలో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనిషికి వెన్నెముక విరగడం లాంటిదని అన్నారు.

మేడిగడ్డపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
X

మేడిగడ్డ బ్యారేజ్ మరమ్మతులకు పనికిరాదని విమర్శించిన కాంగ్రెస్, ఇప్పుడెలా రిపేర్ చేయిస్తుందంటూ ఇటీవల బీఆర్ఎస్ నేతలు సీఎం రేవంత్ రెడ్డిని ఇరుకున పెట్టే ప్రయత్నం చేశారు. అయితే ఈ కౌంటర్లకు రేవంత్ సమాధానమిచ్చారు. మేడిగడ్డ విషయంలో పెద్ద నష్టమే జరిగిందని వివరించారాయన. నిపుణుల సూచనల మేరకే మేడిగడ్డపై కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకెళ్తోందన్నారు రేవంత్ రెడ్డి.

మేడిగడ్డ విషయంలో జరిగిన నష్టం.. 32 పళ్లలో ఒక పన్ను విరగడం లాంటి సమస్య కాదని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. మనిషికి వెన్నెముక విరగడం లాంటిదని అన్నారు. విరిగింది పన్నుకాదు, వెన్ను అని.. దాన్ని సరిచేసినా నష్టం తీరనిదని చెప్పారు. ప్రాజెక్టులో నీరు నిల్వ చేసి, విడుదల చేసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే 52 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని, ఆ నీటి నిల్వకోసం కట్టిన కరెంటు బిల్లులన్నీ సముద్రంలో వదిలిన నీళ్ల లాంటివేనని ఎద్దేవా చేశారు. మేడిగడ్డ వద్ద భూమి లోపల ఏముందనే విషయాన్ని కనిపెట్టకుండానే గత ప్రభుత్వం పనులు మొదలు పెట్టిందని, అలా కనిపెట్టడం పెద్ద విషయమేమీ కాదన్నారు రేవంత్ రెడ్డి. దాన్ని నిపుణులు తేలుస్తారని చెప్పారు. జియోఫిజికల్, జియో టెక్నికల్‌ సర్వే పూర్తి చేసే సామర్థ్యం దేశంలో మూడు జాతీయస్థాయి సంస్థలకే ఉందని అన్నారు. ఈ సర్వే పూర్తి చేయడానికి రెండు ఏజెన్సీల సహాయం కోరామని, డబుల్‌ చెక్‌ చేసే ప్రయత్నం చేస్తున్నామని వివరించారు రేవంత్ రెడ్డి.

తెలంగాణ ఎన్నికల వేళ మేడిగడ్డ బ్యారేజ్ పిల్లర్ కుంగుబాటు వ్యవహారం తీవ్ర చర్చనీయాంశమైంది. సరిగ్గా ఎన్నికలకు ముందు ఈ అంశం వెలుగులోకి రావడంతో అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై కాంగ్రెస్ తీవ్ర విమర్శలు చేసింది. అయితే ఎన్నికల తర్వాత కూడా కాంగ్రెస్ విమర్శలతో సరిపెడుతోందని, తమపై కోపంతో ప్రాజెక్ట్ ని పట్టించుకోవడం లేదని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు. ఎన్నికలైపోయి నెలల గడుస్తున్నా కూడా.. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మేడిగడ్డ వ్యవహారం రాజకీయ విమర్శలకు కారణం అవుతూనే ఉంది.

First Published:  29 May 2024 6:26 AM IST
Next Story