రైతులను మరోసారి సీఎం రేవంత్‌రెడ్డి మోసం చేశారు : హరీశ్‌రావు
ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు.
మహబూబ్‌నగర్‌లో ‘రైతు పండుగ’ సభలో సీఎం రేవంత్‌రెడ్డి మరోసారి రైతులను మోసం చేశారని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. నీ మాటలు చూస్తే రైతులపై ప్రేమ కంటే గిరిజనుల నుండి భూసేకరణ విఫలమయ్యాననే ఆవేదన కనిపించిందన్నారు. ఇప్పటికే నీకు కాంగ్రెస్ తత్వం బోధపడినట్లుంది. మల్లా అవకాశం వస్తదా? వస్తదా? అని భయపడుతున్నవు. అసెంబ్లీకి రమ్మని తెగ పిలుస్తున్నావు రేవంత్ రెడ్డి. మేము ఆ సమయం కోసమే ఎదురు చూస్తున్నం. మీ ఏడాది పాలనలో అన్ని వర్గాలను ఏడిపించడమే తప్ప ప్రజలకు చేసిందేం లేదు. అబద్దాలు చెబుతూ ఏడాది నడిపించావు.
ఈ అబద్దాలతో ఇంకా ఎంతో కాలం మోసం చేయలేవు. అసెంబ్లీలో నీ ఏడాది పాలన అసలు రంగు బయట పెట్టేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. అసెంబ్లీలో మైకులు కట్ చేయకుండా సమయం కేటాయించే దమ్ము మీకుందా? అని హరీశ్‌రావు ప్రశ్నించారు. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న వ్యక్తివి పచ్చి అబద్దాలు మాట్లాడటానికి నోరెలా వచ్చింది రేవంత్ రెడ్డి అని మాజీ మంత్రి హరీశ్‌రావు ప్రశ్నించారు. కేసీఆర్‌కు గజ్వేల్‌లో వెయ్యి ఎకరాల ఫాం హౌజ్ ఉన్నట్లు అబద్ధాలు మాట్లాడం కాదు. నిరూపించేందుకు సిద్దమా..? నిరూపించకుంటే ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేస్తవా..? అని రేవంత్ రెడ్డికి హరీశ్‌రావు సవాల్ విసిరారు.