Telugu Global
Telangana

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది..

తెలుగువారికి ప్రధాని అవకాశం వచ్చినప్పుడు నంద్యాలలో పీవీ నరసింహరావుపై టీడీపీ అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించారని గుర్తు చేశారు రేవంత్‌రెడ్డి.

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర తగ్గుతోంది..
X

జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కాలక్రమంలో తగ్గుతోందని ఆవేదన వ్యక్తం చేశారు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి. ‘గవర్నర్​పేట్- గవర్నర్స్​ హౌజ్​’ అనే​ పుస్తకావిష్కరణ కార్యక్రమానికి హాజరైన సీఎం, జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నేతల ప్రస్థానంపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో నీలం సంజీవరెడ్డి, పీవీ నరసింహారావు, ఎన్టీఆర్.. జాతీయ రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారని గుర్తు చేశారు. ఆ తర్వాత జైపాల్ రెడ్డి, వెంకయ్య నాయుడు వారి స్థాయిని కొంతవరకు నిలబెట్టారని, ప్రస్తుత జాతీయ రాజకీయాల్లో తెలుగువారి పాత్ర కనిపించడం లేదని అన్నారు రేవంత్.


జాతీయ స్థాయిలో హిందీ తర్వాత అత్యధికంగా మాట్లాడే భాష తెలుగు అయినా కూడా.. జాతీయ రాజకీయాల్లో తెలుగు రాష్ట్రాల నాయకులకు ఆ స్థాయి ప్రాధాన్యత దక్కడం లేదన్నారు రేవంత్ రెడ్డి. కేంద్ర కేబినెట్‌లో తెలుగు వాళ్లను వెతికి చూసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. కేంద్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటయితే తెలుగు రాష్ట్రాల నాయకులకు సముచిత స్థానం దక్కుతుందన్నారు రేవంత్.

తెలుగు వారంతా కలసి ప్రయాణం మొదలు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తెలుగువారికి ప్రధాని అవకాశం వచ్చినప్పుడు నంద్యాలలో పీవీ నరసింహరావుపై టీడీపీ అభ్యర్థిని పోటీ పెట్టకుండా ఆ స్థానాన్ని ఏకగ్రీవం చేసేందుకు ఎన్టీఆర్ ప్రయత్నించారని గుర్తు చేశారు. తెలుగు ప్రజల సంక్షేమం కోసం రాజకీయాల్లో అలాంటి మంచి సంప్రదాయాన్ని పాటించిన నాయకుడు ఎన్టీఆర్ అని కొనియాడారు. తమ ప్రభుత్వం కూడా అలాంటి సంప్రదాయాలను పాటిస్తుందని, తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినా అంతా ఏకతాటిపై ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు రేవంత్ రెడ్డి. అభివృద్ధిని ప్రజల చెంతకు చేరవేయడానికి తమ వంతు కృషి చేస్తామని.. ఇందుకు అందరి సహకారం ఉండాలని కోరారు.

First Published:  3 March 2024 9:18 PM IST
Next Story