Telugu Global
Telangana

నేను మీ రేవంతన్నను.. నా మాట వినండి

బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి.

నేను మీ రేవంతన్నను.. నా మాట వినండి
X

నిరుద్యోగులు నిరసనలు, ఆందోళనలు చేయాల్సిన అవసరం లేదని అన్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి. ఇటీవల తెలంగాణలో వివిధ పోటీ పరీక్షల అభ్యర్థులు చేపట్టిన ఆందోళనలపై ఆయన స్పందించారు. యువకులు ఆందోళనలవైపు వెళ్లొద్దని సమస్యలుంటే మంత్రులు, ఉన్నతాధికారులను కలవాలని సూచించారు. 'మీ రేవంత్ అన్నగా మీకోసం నేను అండగా ఉంటా'నని భరోసా ఇచ్చారు. రంగారెడ్డి జిల్లాలోని వట్టినాగులపల్లిలో నిర్వహించిన అగ్నిమాపక శాఖ పాసింగ్‌ అవుట్‌ పరేడ్‌లో పాల్గొన్న సీఎం రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.


బీఆర్ఎస్ హయాంలో నిరుద్యోగులు ఉద్యోగ, ఉపాధి కోసం ఎదురు చూశారని, తాము అధికారంలోకి వచ్చిన 90 రోజుల్లోనే 31 వేల ఉద్యోగ నియామక పత్రాలు అందించామని చెప్పుకొచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. అయితే రేవంత్ రెడ్డి ఇచ్చిన నియామక పత్రాలు గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్లకు సంబంధించినవి అనేది ఇక్కడ ఆసక్తికర అంశం. ఇక బడ్జెట్‌లో విద్య, వ్యవసాయానికి అత్యంత ప్రాధాన్యం ఇచ్చామన్నారు సీఎం రేవంత్. తాము అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తేదీనే జీతాలు ఇస్తున్నామన్నారు.

తెలంగాణ ఏర్పాటుకు నిరుద్యోగ సమస్యే అత్యంత కీలకంగా మారిందని గుర్తు చేశారు సీఎం రేవంత్‌రెడ్డి. అగ్నిమాపక శాఖలో పాసింగ్ అవుట్ పరేడ్ పూర్తి చేసుకున్న నూతన ఉద్యోగులకు అభినందనలు తెలిపారాయన. అగ్నిమాపక శాఖలో ఉద్యోగం జీతభత్యాల కోసం చేసేది కాదని, విపత్తును జయించే సామాజిక బాధ్యత అని గుర్తు చేశారు. ఈ పాసింగ్ అవుట్ పరేడ్‌లో 483 మంది ఉద్యోగులు శిక్షణ పొందితే అందులో 90 శాతం మంది యువకులు గ్రామీణ ప్రాంతాలకు చెందిన వారు కావడం సంతోషకరమని అన్నారు. ప్రజల ఆలోచనలు వినడానికి తామెప్పుడూ సిద్ధంగానే ఉంటామని, అది ప్రజా ప్రభుత్వ విధానం అని స్పష్టం చేశారు రేవంత్ రెడ్డి.

First Published:  26 July 2024 7:53 AM GMT
Next Story