ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డి.. రేవంత్ ప్రకటన
మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకే జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన MSN ల్యాబ్స్ డైరెక్టర్‌గా ఉన్నారు.
మహబూబ్‌నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ అభ్యర్థిగా జీవన్ రెడ్డిని ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి. మహబూబ్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా దీవెన సభలో అధికారికంగా ప్రకటన చేశారు. జీవన్ రెడ్డిని గెలిపించాలని పిలుపునిచ్చారు.
గతంలో బీఆర్ఎస్ పార్టీలో కీలకంగా వ్యవహరించిన జీవన్ రెడ్డి.. ఇటీవలే కాంగ్రెస్ పార్టీలో చేరారు. మహబూబ్‌నగర్ సిట్టింగ్ ఎంపీ, బీఆర్ఎస్ నేత మన్నె శ్రీనివాస్ రెడ్డి సోదరుడి కొడుకే జీవన్ రెడ్డి. ప్రస్తుతం ఆయన MSN ల్యాబ్స్ డైరెక్టర్‌గా ఉన్నారు. మన్నె శ్రీనివాస్ రెడ్డి ఈ సారి కూడా బీఆర్ఎస్ అభ్యర్థిగా మహబూబ్‌నగర్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేయబోతున్నారు.
ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లో కల్వకుర్తి నుంచి ఎమ్మెల్యేగా గెలవడంతో ఎమ్మెల్సీ పదవికి కసిరెడ్డి నారాయణ రెడ్డి రాజీనామా చేశారు. దీంతో ఈ స్థానానికి ఈ నెల 28న ఎన్నిక జరగనుంది. బీఆర్ఎస్ అభ్యర్థిగా దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి పోటీ చేస్తారని తెలుస్తోంది.