ఆ మూడు అంశాలపై జ్యుడీషియల్ ఎంక్వైరీ.. - సీఎం రేవంత్ సంచలన నిర్ణయం
యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
మరో సంచలన నిర్ణయం తీసుకున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విద్యుత్ రంగంపై న్యాయ విచారణకు విచారణకు ఆదేశిస్తూ అసెంబ్లీ సాక్షిగా ప్రకటన చేశారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టుకు సంబంధించి తనపై వస్తున్న ఆరోపణలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలన్న మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి సవాల్‌ను సీఎం స్వీకరించారు. యాదాద్రి పవర్ ప్రాజెక్టు, భద్రాద్రి ప్రాజెక్టులో కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం, ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందంపై సిట్టింగ్ జడ్జితో విచారణకు ఆదేశిస్తున్నట్లు తెలిపారు.
"ఛత్తీస్‌గఢ్‌తో విద్యుత్ ఒప్పందం దారుణం. ఒప్పందాల వెనుక ఉన్న ఉద్దేశాలు బయటకు రావాలి. టెండర్లు లేకుండా ఒప్పందం చేసుకున్నారు. దీని వెనుకాల ఉన్న పెద్ద తలకాయలు అన్నీ విచారణలో బయటికి వస్తాయి. అప్పటిదాకా నేనేం మాట్లాడను. ఛత్తీస్‌గఢ్ ఒప్పందంపై ఓ అధికారి నిజాలు చెబితే ఆ ఉద్యోగి హోదా తగ్గించి మారుమూల ప్రాంతాలకు పంపారు. ఛత్తీస్‌గఢ్‌తో 1000 మెగావాట్ల ఒప్పందం చేసుకోగా.. దీనివల్ల ప్రభుత్వంపై రూ.1,362 కోట్ల భారం పడింది. భద్రాద్రి పవర్ ప్రాజెక్టులో రూ.వేల కోట్ల అవినీతి జరిగింది.
కేంద్రప్రభుత్వం తక్కువ ధరకే విద్యుత్ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నా.. కేసీఆర్ పెడచెవిన పెట్టారు. విద్యుత్ అనేది ప్రజల సెంటిమెంట్. దాన్ని క్యాష్ చేసుకుని కేసీఆర్ అనేక అవకతవకలకు పాల్పడ్డారు. తెలంగాణకు నష్టం కలిగేలా ఒప్పందాలు చేసుకున్నారు. గుజరాత్ కంపెనీ ఇండియా బుల్స్‌కు లాభం చేకూర్చి రాష్ట్రాన్ని ముంచేశారు. కాలం చెల్లిన సబ్ క్రిటికల్ టెక్నాలజీ వాడకం వల్ల విద్యుత్ సామర్థ్యం తగ్గుతుంది. రాష్ట్రానికి తీరని నష్టమని సభలో ఆనాడు మేం సభలో ప్రశ్నిస్తే మార్షల్స్‌ని పెట్టి మమ్నల్ని బయటికి పంపించేశారు. భద్రాద్రికి కనీసం టెండర్లు కూడా పిలవలేదు. టెండర్ల కోసం రెండు నెలల సమయం కూడా వృథా చేయను. రైతులకు వెంటనే కరెంట్ ఇస్తానని కేసీఆర్ ప్రగల్భాలు పలికారు. భద్రాద్రిని రెండేళ్లలో పూర్తి చేస్తామని చెప్పి.. ఏడేళ్లు తీసుకున్నారు. రూ. 6కోట్ల 75లక్షలతోనే మెగావాట్ విద్యుత్ ఉత్తత్తి చేస్తామని చెప్పారు.
కానీ, ఏడేళ్లకు మెగావాట్ ధర రూ. 9కోట్ల 74లక్షలకు పెరిగింది. గుజరాత్ కంపెనీకి రావాల్సిన డబ్బులు వచ్చాయి. వాళ్లు లాభాల్లోకి వెళ్లారు. తెలంగాణ ప్రజలు మాత్రం నష్టపోయారు. సేమ్ యాదాద్రి విషయంలోనూ జనాన్ని ఇలానే మోసం చేశారు. రెండేళ్లలో ప్రాజెక్టు పూర్తి చేసి తెలంగాణలో వెలుగులు తెస్తామన్నారు. ఎనిమిదేళ్లు గడస్తున్నా ప్రాజెక్టు పూర్తి కాలేదు. విద్యుత్‌శాఖలో ఇలా ఎన్నో లోపాలున్నాయి. అన్నింటిపై విచారణ చేపట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. 24 గంటల విద్యుత్‌పైనా అఖిల పక్షంతో నిజనిర్ధారణ కమిటీ వేస్తం" అని అసెంబ్లీలో ప్రకటించారు సీఎం రేవంత్ రెడ్డి.