Telugu Global
Telangana

'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ'.. దావోస్ లో కీలక భేటీలు..

దావోస్ టూర్​కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిశామని, వారితో ముచ్చటించడం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి.

ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ.. దావోస్ లో కీలక భేటీలు..
X

'ఇన్వెస్ట్ ఇన్ తెలంగాణ' పేరుతో ప్రపంచ ఆర్థిక సదస్సు వేదికగా తెలంగాణ ప్రభుత్వం పెట్టుబడులను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది. దావోస్ సదస్సు తొలిరోజు పలువురు ప్రముఖులతో తెలంగాణ బృందం కీలక చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి.. వరల్డ్ ఎకనామిక్ ఫోరం ప్రెసిడెంట్ బోర్గ్ బ్రెండెతో సమావేశమయ్యారు. తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలపై చర్చించారు. తెలంగాణ ప్రభుత్వ ప్రాధాన్యతలను వివరించారు. ప్రభుత్వాలతో పాటు పారిశ్రామికవేత్తలు, వ్యాపార వాణిజ్య వాటాదారులు కలిసికట్టుగా పని చేస్తే ప్రజలను సంపన్నులవుతారని, సుస్థిరమైన అభివృద్ధితో పాటు జీవన ప్రమాణాలు మెరుగుపడితే ప్రజలు మరింత ఆనందంగా ఉంటారని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి.


ఇథియోఫియా డిప్యూటీ ప్రైమ్ మినిస్టర్ డెమెక్ హసెంటోతో కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. పారిశ్రామిక అభివృద్ధికి తెలంగాణ ప్రభుత్వం ఎంచుకున్న రూట్​ మ్యాప్ ​పై చర్చించారు. నేషనల్ అసోషియేషన్ ఆఫ్ సాఫ్ట్ వేర్ అండ్ సర్వీసెస్ కంపెనీస్ (NASSCOM) ప్రెసిడెంట్ శ్రీమతి దేబ్జానీ ఘోష్​ తో కూడా తెలంగాణ ప్రతినిధి బృందం సమావేశమైంది. రాష్ట్రంలో స్కిల్ డెవెలప్​మెంట్​ పై ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని చెప్పారు అధికారులు. ఇంజినీరింగ్, డిగ్రీ కోర్సులు చదువుతున్నయువతకు స్కిల్ డెవలప్ మెంట్, ప్లేస్​మెంట్​ కమిట్మెంట్, ఉద్యోగాల కల్పనకు సాయం అందించే అంశాలపై సంప్రదింపులు జరిపారు.


దావోస్ టూర్​కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి, మంత్రి శ్రీధర్ బాబుకు పలువురు ఎన్నారైలు ఘన స్వాగతం పలికారు. జ్యూరిచ్ ఎయిర్ పోర్ట్ లో మన దేశానికి చెందిన ప్రముఖులను కలిశామని, వారితో ముచ్చటించడం సంతోషాన్నిచ్చిందన్నారు రేవంత్ రెడ్డి. నవ తెలంగాణ నిర్మాణంకోసం మొదలైన తమ ప్రభుత్వ ప్రయత్నంలో భాగస్వాములు కావాలని ఎన్నారైలకు పిలుపునిచ్చారు సీఎం. మంత్రి శ్రీధర్ బాబు కూడా ఎన్నారైల స్వాగతంపై ట్వీట్ వేశారు.

First Published:  16 Jan 2024 11:44 AM IST
Next Story