తెలంగాణ నుంచి పోటీ.. సోనియా ఏమన్నారంటే..!
తెలంగాణ తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందువల్లే తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని సోనియాతో చెప్పారు రేవంత్.
ఢిల్లీ పర్యటనలో భాగంగా సోమవారం AICC మాజీ చీఫ్ సోనియాగాంధీతో సమావేశమయ్యారు సీఎం రేవంత్ రెడ్డి. ఈ సమావేశంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ నుంచి పోటీ చేయాలని సీఎం రేవంత్ రెడ్డి సోనియాను విజ్ఞప్తి చేశారు. ఇందుకు సంబంధించి పీసీసీ తీర్మానించిన విషయాన్ని సోనియా దృష్టికి తీసుకెళ్లారు. తెలంగాణ తల్లిగా రాష్ట్ర ప్రజలు గుర్తిస్తున్నందువల్లే తెలంగాణ నుంచి పోటీ చేయాలని కోరుతున్నామని సోనియాతో చెప్పారు రేవంత్.
CM Revanth Reddy met Sonia Gandhi and urged her to contest from Telangana in upcoming Lok Sabha elections.
— Naveena (@TheNaveena) February 5, 2024
She said she wud take decision at right time.
He briefed about status of implementation of guarantees.
He also met Rahul Gandhi during his Bharat Jodo Nyay Yatra and… pic.twitter.com/YQBDhXVp2k
అయితే రేవంత్ రెడ్డి విజ్ఞప్తిపై స్పందించిన సోనియా గాంధీ.. సరైన సమయంలో నిర్ణయం తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న హామీల గురించి సోనియాకు వివరించారు సీఎం, మంత్రులు.
ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారంటీల్లో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం, ఆరోగ్య శ్రీ 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంపు హామీలను ఇప్పటికే అమల్లోకి తెచ్చినట్లు సోనియాకు వివరించారు. ఇక త్వరలోనే రూ.500కే సిలిండర్, 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అందిస్తామని సోనియాకు వివరించారు. దాదాపు అరగంట పాటు సోనియాతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. రాష్ట్రంలో ప్రభుత్వం ఏర్పడ్డ తర్వాత సోనియాతో భేటీ కావడం ఇదే తొలిసారి.