సినిమా వాళ్ల బాధ్యత గుర్తు చేసిన సీఎం రేవంత్ రెడ్డి
సమాజాన్ని ప్రభావితం చేయగల సినిమా రంగం ఆ రెండు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి.
కొత్త సినిమాల విడుదలప్పుడు నిర్మాతలు, దర్శకులు.. టికెట్ రేట్లు పెంచుకుంటామంటూ తెలంగాణ ప్రభుత్వం వద్దకు వస్తే ఇకపై వారి నుంచి కొత్త ప్రశ్న ఎదురవుతుంది. మీకేంటి..? అని మీరడుగుతున్నారు సరే, మీ ద్వారా సమాజానికేంటి..? అని అడుగుతారు అధికారులు. డ్రగ్స్, సైబర్ క్రైమ్స్ నియంత్రణపై ఆ సినిమాలోని ప్రధాన తారాగణం చేసిన వీడియోలు చూపించాలంటారు. అవి చూపించిన తర్వాతే వారికి కావాల్సిన అనుమతులు ఇస్తారు. ఇకపై అధికారులు ఇలాగే చేయాలని, సినిమా షూటింగ్ ల పర్మిషన్లు, టికెట్ల రేట్ల పెంపు, తదితర విషయాల్లో మరీ ఉదాసీనంగా ఉండొద్దని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. సమాజం నుంచి చాలా తీసుకుంటున్న సినిమా వాళ్లు, సమాజానికి ఆమాత్రం ఇవ్వరా అని ప్రశ్నించారు.
Live: Hon'ble Chief Minister Sri. A.Revanth Reddy flagging off the newly provided vehicles of the Telangana Anti-Narcotics Bureau and the Telangana Cyber Security Bureau at Command & Control Centre, Banjara Hills https://t.co/N2SHAxIT1D
— Revanth Reddy (@revanth_anumula) July 2, 2024
తెలంగాణలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉందని చెప్పిన సీఎం రేవంత్ రెడ్డి.. అది కేవలం బాధితులతో మాత్రమేనని, నేరగాళ్లతో ఫ్రెండ్లీగా ఉంటే పోలీస్ వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లుతుందని అన్నారు. హైదరాబాద్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో నార్కోటిక్, సైబర్ సెక్యూరిటీ ఫొటో ఎగ్జిబిషన్ ని సందర్శించిన ఆయన టీజీ న్యాబ్ వాహనాలను కూడా ప్రారంభించారు. పోలీస్ వ్యవస్థ అధునాతన సాంకేతికతను ఉపయోగించుకోవాలని సూచించారు. అదే సమయంలో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ రవాణాపై సీరియస్ గా దృష్టి సారించాలని చెప్పారు. నేడు ప్రపంచం ఎదుర్కొంటున్న అతి పెద్ద విపత్తుల్లో సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వాడకం మొదటి స్థానాల్లో ఉన్నాయని చెప్పారు రేవంత్ రెడ్డి.
సైబర్ క్రైమ్, డ్రగ్స్ కేసుల విచారణలో నైపుణ్యం ప్రదర్శించిన పోలీసులకు నగదు బహుమానంతో పాటు ప్రమోషన్ కూడా ఇచ్చేలా మార్గదర్శకాలు రూపొందించాలన్నారు. ఇది కేవలం పోలీసులకు సంబంధించిన విషయం మాత్రమే కాదని, సాధారణ పౌరులు ఇతర రంగాల వారు కూడా అవేర్ నెస్ కలిగి ఉండాలన్నారు. ముఖ్యంగా సమాజాన్ని ప్రభావితం చేయగల సినిమా రంగం ఆ రెండు నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హీరో హీరోయిన్లు, ఇతర నటీనటులు సైబర్ క్రైమ్స్, డ్రగ్స్ వాడకానికి వ్యతిరేకంగా ప్రచారం చేపట్టాలన్నారు. సినిమా హాళ్లలో కూడా నటీనటులపై రూపొందించిన అవగాహన వీడియోలు ప్రదర్శించాలన్నారు రేవంత్ రెడ్డి.