Telugu Global
Telangana

పెద్దన్న వ్యాఖ్యలపై రేవంత్ నష్టనివారణ చర్యలు..

రేవంత్ మాట మార్చారంటూ అప్పుడే బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. చాకిరేవు పెడతా, చిరిగేదాకా ఉతికి ఆరేస్తానంటూ బీజేపీని ఉద్దేశించి రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది.

పెద్దన్న వ్యాఖ్యలపై రేవంత్ నష్టనివారణ చర్యలు..
X

ఆదిలాబాద్ సభలో ప్రధాని మోదీని పెద్దన్నగా సంబోధించిన సీఎం రేవంత్ రెడ్డి.. బీఆర్ఎస్ ఊహించని ఎదురుదాడితో కాస్త వెనక్కు తగ్గినట్టు అనిపిస్తోంది. వరుసగా రెండు రోజులపాటు తన వ్యాఖ్యలకు పరోక్షంగా వివరణ ఇచ్చిన ఆయన.. ఎట్టకేలకు నిన్న జరిగిన పాలమూరు ప్రజా దీవెన సభలో బీజేపీపై విరుచుకుపడ్డారు.

"కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు నిధులు, అవసరమైన అనుమతులు ఇవ్వకపోతే చాకిరేవు పెట్టి చిరిగే దాకా ఉతికే బాధ్యత తీసుకుంటా. ప్రధాని మోదీ రాష్ట్రాభివృద్ధికి సహకరించకపోతే తెలంగాణలోనే కాదు, దేశంలోని అన్ని రాష్ట్రాలు తిరిగి ఆయనకు వ్యతిరేకంగా కొట్లాడతా"నంటూ పాలమూరు సభలో తేల్చి చెప్పారు రేవంత్ రెడ్డి.

రాష్ట్రానికి నిధులివ్వాలని, అభివృద్ధికి సహకరించాలని.. సభాముఖంగా తాను ప్రధాని మోదీకి విజ్ఞప్తి చేశానని చెప్పుకొచ్చారు రేవంత్ రెడ్డి. ఇంటికి అతిథి వచ్చినప్పుడు మర్యాద ఇవ్వడం మన సంస్కారం అని నమ్మేవాడిని కాబట్టి తాను దేశ ప్రధానికి గౌరవం ఇచ్చానన్నారు. తెలంగాణకు మేలు జరగాలనేదే తన తపన అన్నారు రేవంత్. రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల మధ్య సంఘర్షణ ఉంటే చివరికి రాష్ట్రానికే నష్టం జరుగుతుందని, ఘర్షణ వైఖరి ప్రభుత్వాల మధ్య ఉండకూడదనే ఉద్దేశంతోనే తాను మోదీకి వినతిపత్రాలిచ్చానని చెప్పారు.

బీఆర్ఎస్ కౌంటర్లు..

రేవంత్ మాట మార్చారంటూ అప్పుడే బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు మొదలయ్యాయి. చాకిరేవు పెడతా, చిరిగేదాకా ఉతికి ఆరేస్తానంటూ బీజేపీని ఉద్దేశించి రేవంత్ ఘాటు వ్యాఖ్యలు చేయడాన్ని మళ్లీ బీఆర్ఎస్ హైలైట్ చేస్తోంది. కాంగ్రెస్ అధిష్టానం ఆగ్రహం వ్యక్తం చేయడం వల్లే రేవంత్ ఇలా మాట్లాడుతున్నారని బీఆర్ఎస్ కౌంటర్లిస్తోంది. మొత్తమ్మీద రెండు రోజులపాటు జరిగిన పెద్దన్న హడావిడికి రేవంత్ రెడ్డి ఇలా ఫుల్ స్టాప్ పెట్టారనమాట.

First Published:  7 March 2024 9:11 AM IST
Next Story