రాష్ట్రమంతటా రేవంత్ ప్రచారం.. షెడ్యూల్ ఇదే..!
మెదక్, వరంగల్, భువనగిరి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభల్లో పాల్గొంటారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది.
పార్లమెంట్ ఎన్నికల కోసం ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనుంది అధికార కాంగ్రెస్ పార్టీ. ముఖ్య నేతలు అన్ని నియోజకవర్గాల్లో తిరగాలని హైకమాండ్ ఆదేశించింది. సొంత జిల్లాలకే పరిమితం కాకుండా ఇతర ప్రాంతాలకూ వెళ్లాలని సూచించింది. మొక్కుబడిగా వ్యవహరిస్తున్న పలువురు నేతలను AICC హెచ్చరించినట్లు సమాచారం.
సీఎం రేవంత్ రెడ్డి ప్రచారంలో భాగంగా అన్ని పార్లమెంట్ నియోజకవర్గాలనూ చుట్టేయనున్నారు. ఇవాళ, రేపు కేరళలో కాంగ్రెస్ తరఫున ప్రచారం చేయనున్న రేవంత్ రెడ్డి.. అక్కడి నుంచి వచ్చిన తర్వాత మెదక్, వరంగల్, భువనగిరి అభ్యర్థుల నామినేషన్ల దాఖలు సందర్భంగా నిర్వహించే ర్యాలీలు, సభల్లో పాల్గొంటారు. ఈ నెల 19 నుంచి రాష్ట్రమంతా సుడిగాలి పర్యటనలు చేసేలా పార్టీ ప్రణాళికలు సిద్ధం చేసింది. ఒక్కో పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో మూడు చోట్ల సీఎం సభలు ఉండేలా ప్లాన్ చేస్తోంది.
గురువారం తెలంగాణలోని పార్లమెంట్ స్థానాలకు నోటిఫికేషన్ రానుంది. గురువారం నుంచే నామినేషన్ల స్వీకరణ కూడా ప్రారంభం కానుంది. గురు, శుక్రవారాల్లో మంచి ముహూర్తం ఉండడంతో చాలా మంది అభ్యర్థులు నామినేషన్లకు ప్లాన్ చేసుకున్నట్లు సమాచారం.