10 రోజులు రాష్ట్రానికి దూరంగా రేవంత్.. షెడ్యూల్ ఇదే..!
రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడపనున్నారు రేవంత్. ఇక ఆదివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి దాదాపు 10 రోజుల పాటు రాష్ట్రానికి దూరంగా ఉండనున్నారు. శుక్రవారం సాయంత్రమే ఆయన ఢిల్లీకి చేరుకున్నారు. ఇవాళ పలువురు కేంద్రమంత్రులు, కాంగ్రెస్ పార్టీ అగ్రనేతలతో సమావేశమవుతారు. కేంద్రమంత్రులతో రాష్ట్రానికి సంబంధించిన ప్రాజెక్టులు, నిధులు ఇతర అవసరాలపై చర్చిస్తారు. ఇక పార్టీ నేతలతో ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక, తాజా పరిస్థితులపై వివరిస్తారు.
మొత్తంగా రెండు రోజుల పాటు ఢిల్లీ పర్యటనలో బిజిబిజీగా గడపనున్నారు రేవంత్. ఇక ఆదివారం ఈశాన్య రాష్ట్రం మణిపూర్ నుంచి రాహుల్ గాంధీ చేపట్టబోయే భారత్ న్యాయ యాత్ర ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటారు.
ఈ నెల 15న ఢిల్లీ నుంచి నేరుగా స్విట్జర్లాండ్ బయల్దేరుతారు రేవంత్. దావోస్‌లో జరిగే వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సదస్సులో ఆయన పాల్గొంటారు. వివిధ అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరపనున్నారు. దావోస్ నుంచి లండన్ వెళ్లనున్నారు రేవంత్. దాదాపు మూడు రోజుల పాటు లండన్‌లో పర్యటించనున్నారు. ఈ నెల 23న రాష్ట్రానికి తిరిగి రానున్నారు.