Telugu Global
Telangana

కేసీఆర్‌కు రేవంత్‌ ఆహ్వానం.. దశాబ్ది వేడుకలకు రావాలని పిలుపు

జూన్‌ 2న నిర్వహించే అధికారిక కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపింది.

కేసీఆర్‌కు రేవంత్‌ ఆహ్వానం.. దశాబ్ది వేడుకలకు రావాలని పిలుపు
X

బీఆర్ఎస్ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు వ్యక్తిగతంగా లేఖ రాశారు సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల్లో భాగంగా జూన్ 2న పరేడ్‌ గ్రౌండ్‌లో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే వేడుకలకు హాజరుకావాల్సిందిగా కేసీఆర్‌ను కోరారు రేవంత్. ఈ ఆహ్వాన లేఖను స్వయంగా కేసీఆర్‌కు అందించాలని..ప్రొటోకాల్ సలహాదారు హర్కర వేణుగోపాల్‌, డైరెక్టర్‌ అరవింద్‌ సింగ్‌లను రేవంత్ ఆదేశించారు.

కేసీఆర్‌కు లేఖ అందించేందుకు ఈ ఇద్దరు అధికారులు.. ఆయన సిబ్బందితో చర్చలు జరిపారు. ప్రస్తుతం కేసీఆర్ ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో ఉన్నారని సిబ్బంది వెల్లడించారు. దీంతో ఫామ్‌హౌస్‌కు వెళ్లి కేసీఆర్‌ ఆహ్వాన పత్రికను అందించేందుకు అధికారులు ప్రయత్నిస్తున్నారని సీఎంవో స్పష్టం చేసింది.

జూన్‌ 2న నిర్వహించే అధికారిక కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సన్మానించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఉద్యమకారులకు ఆహ్వానాలు పంపింది. రేవంత్ ఆహ్వానంపై బీఆర్ఎస్ శ్రేణులు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నాయి. కేసీఆర్ హాజరుకావాలని కొంతమంది అభిప్రాయపడుతుంటే.. మరికొందరు హాజరుకాకపోవడమే మేలని సూచిస్తున్నారు. రేవంత్ ఆహ్వానాన్ని మన్నించి కేసీఆర్ దశాబ్ధి వేడుకలకు హాజరవుతారా.. లేదా అనేది సస్పెన్స్‌గా మారింది. మరోవైపు అదే రోజు బీఆర్ఎస్‌ సైతం ప్రత్యేక కార్యక్రమాలను నిర్వహించాలని ప్లాన్ చేసింది.

First Published:  31 May 2024 7:34 AM IST
Next Story