ఇదేమి రాజకీయం రేవంత్!
కొన్నాళ్ళ కిందట తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకు భిన్నంగా బీఆర్‌ఎస్‌కు చెందిన వారిని తమ పార్టీలో కలుపుకొని టికెట్లు ఇవ్వడం ఏం రాజకీయమని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నుంచి అరువు తెచ్చుకుంటే తప్ప సొంతంగా అభ్యర్థులని ఎంపిక చేసుకోలేని స్థితిలో తెలంగాణ కాంగ్రెస్ ఉన్నదని లోక్‌సభ కాంగ్రెస్ మూడో అభ్యర్థుల జాబితాని చూసిన రాజకీయ పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో ఘన విజయం సాధించినప్పటికీ తన బలహీనతలని అధిగమించలేని దుస్థితిలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ఉండటం విడ్డూరమని అంటున్నారు. తాజాగా ప్రకటించిన కాంగ్రెస్ మూడో జాబితాలో పెద్దపల్లి నుంచి గడ్డం వంశీకృష్ణ, నాగర్ కర్నూలు నుంచి మల్లు రవి మాత్రమే కాంగ్రెస్‌లో మొదటినుంచి ఉన్నవారు. తాజాగా బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన రంజిత్‌రెడ్డి, దానం నాగేందర్, సునీతా మహేందర్ రెడ్డిలను చేవేళ్ళ, సికింద్రాబాద్, మల్కాజ్‌గిరి అభ్యర్థులుగా ఎంపిక చేసింది కాంగ్రెస్ అధిష్టానం. ఇదంతా పీసీసీ అధ్యక్షునిగా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కనుసన్నల్లో అమలవుతున్న వ్యూహం. ఈ మూడు స్థానాలకు తగిన అభ్యర్థులు కాంగ్రెస్‌లో లేరా? బీఆర్‌ఎస్ నుంచి అరువు తెచ్చుకోవాల్సిన అవసరం ఏమిటనే ప్రశ్నలు కాంగ్రెస్ వర్గాల నుంచే వినిపిస్తున్నాయి.
కొన్నాళ్ళ కిందట తెలంగాణలో కొత్త రాజకీయ సంస్కృతిని తీసుకువస్తామని రేవంత్‌రెడ్డి చెప్పారు. ఇందుకు భిన్నంగా బీఆర్‌ఎస్‌కు చెందిన వారిని తమ పార్టీలో కలుపుకొని టికెట్లు ఇవ్వడం ఏం రాజకీయమని సీనియర్ రాజకీయ నాయకులు అంటున్నారు. కేసీఆర్ తరహాలోనే తాను కూడా రాజకీయం చేస్తానంటే రాజకీయాలలో రేవంత్ మార్కు అంటూ ప్రత్యేకంగా ఏం ఉంటుంది? ఇంకా అభ్యర్థులను ఖరారు చేయని స్థానాలలో కూడా బీఆర్‌ఎస్ నుంచి అరువు తెచ్చుకొని నిలబెట్టడానికి ప్రయత్నిస్తున్నారనేది వినికిడి.
ఇదే నిజమైతే తెలంగాణలో రేవంత్ పాదు కొలిపే కొత్త రాజకీయ సంస్కృతి ఏమిటన్నదే అసలు ప్రశ్న. అంతేగాక పదేళ్ళుగా పార్టీని కాపాడుకుంటూ వస్తున్న వారిని కాదని ఇతర పార్టీల వారిని చేర్చుకొని పదవులు అప్పగించడం చూస్తే, క్రమేణా కాంగ్రెస్‌లో అసమ్మతిని తనకు తానుగా రాజేసుకున్నట్టవుతుందని రేవంత్ ఎందుకు గ్రహించలేకపోతున్నారు. మహబూబ్‌నగర్‌లో బీజేపీ నేత జితేందర్‌రెడ్డిని పార్టీలో చేర్చుకొని ఢిల్లీలో ప్రభుత్వ ప్రతినిధిగా నియమించారు. ఇదే తరహాలో ఇతర పార్టీల వారిని చేర్చుకుంటూ పదవులని పంచిపెడితే ఏళ్ళ తరబడి పార్టీ జెండాలు మోసినవారి పరిస్థితి ఏమిటి? బీఆర్‌ఎస్‌ను బలహీనపరిచే పేరిట ఆ పార్టీ వారిని చేర్చుకొని లబ్ది చేకూర్చడం చాలామంది కాంగ్రెస్ కార్యకర్తలకు, స్థానిక నాయకులకు నచ్చడం లేదు. ఇదంతా గమనిస్తున్న కాంగ్రెస్ సీనియర్ నాయకులు ఇదేమి రాజకీయం రేవంత్ అని వాపోతున్నారు. తాత్కాలికంగా లోక్‌సభ ఎన్నికల సమయాన బయటికి ఎవరూ ఏమనకపోవచ్చు. కానీ, స్థానికంగా చెలరేగే అసంతృప్తులు అభ్యర్థుల గెలుపుపై ప్రభావం చూపకుండా వుంటాయా?