Telugu Global
Telangana

దుబాయ్ లో సీఎం రేవంత్ టీమ్

పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలతో తెలంగాణ బృందం దుబాయ్ లో చర్చలు జరిపింది.

దుబాయ్ లో సీఎం రేవంత్ టీమ్
X

దావోస్ టూర్ ముగించుకుని లండన్ వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి టీమ్.. అటునుంచి దుబాయ్ చేరుకుంది. దుబాయ్ లో కూడా మూసీ నది అభివృద్ధి ప్రణాళికలపై నిపుణులతో చర్చించారు రేవంత్ రెడ్డి. దాదాపు 56 కిలోమీటర్ల మూసీ పరీవాహకం అభివృద్ధి, సుందరీకరణతో పాటు వాణిజ్య అవకాశాలపై చర్చించారు.

పట్టణాభివృద్ధి, మాస్టర్ ప్లాన్, సిటీ స్పేస్ అభివృద్ధిలో అనుభవమున్న అంతర్జాతీయ సంస్థలతో తెలంగాణ బృందం చర్చించింది. అందులో పలు ప్రముఖ సంస్థలు మూసీ ప్రాజెక్టును చేపట్టేందుకు ఆసక్తిని కనబరిచాయని అంటున్నారు. ఆయా సంస్థలు అవసరమైతే హైదరాబాద్ వచ్చి మూసీ పరిసరాలు పరిశీలించి తదుపరి చర్యలు చేపడతామని తెలిపాయి. ఈ అర్ధరాత్రి వరకు వివిధ సంస్థలతో సీఎం టీమ్ చర్చలు కొనసాగిస్తుందని తెలుస్తోంది. ఈ సమావేశాల తర్వాత వారు రేపు భారత్ కి తిరిగొస్తారు


మూసీ పునరుద్ధరణ తర్వాత హైదరాబాద్‌ అరుదైన నగరంగా ప్రపంచంలోనే గుర్తింపు తెచ్చుకుంటుందని అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ను ఇతర భారతీయ నగరాలతో పోటీకి నిలపాలనుకోవడంలేదని, ప్రపంచవ్యాప్తంగా అత్యుత్తమమైన నగరాలతో హైదరాబాద్ పోటీ పడుతుందని ఆయన చెప్పారు. హైదరాబాద్ అభివృద్ధికి కట్టుబడి ఉన్నామన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

సీఎం రేవంత్ రెడ్డి టీమ్ విదేశీ పర్యటన నేటితో ముగుస్తుంది. దావోస్ పెట్టుబడుల విషయంలో గత రికార్డులు బ్రేక్ చేశామని కాంగ్రెస్ చెబుతోంది. రేవంత్ రెడ్డి ఇంటర్వ్యూని, అక్కడ చేసిన వ్యాఖ్యల్ని బీఆర్ఎస్ నేతలు ఎద్దేవా చేశారు. అదానీతో కుదిరిన ఒప్పందంపై తెలంగాణలో రాజకీయ దుమారం రేగింది. అదే సమయంలో సీఎం రేవంత్.. లండన్ లో చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా సంచలనంగా మారాయి. బీఆర్ఎస్ నుంచి కౌంటర్లు పడ్డాయి. మొత్తమ్మీద సీఎం రేవంత్ రెడ్డి తొలి విదేశీ పర్యటన.. రాష్ట్రంలో ప్రతిరోజూ వార్తల్లో నిలిచినట్లయింది.

First Published:  21 Jan 2024 7:20 PM IST
Next Story