26, 27న సీఎం కేసీఆర్ మహారాష్ట్ర పర్యటన.. విఠలేశ్వరుడి దర్శనానికి సీఎం
తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికులు, బీఆర్ఎస్ నేతల కుటుంబాలను సీఎం కేసీఆర్ కలుస్తారు.
బీఆర్ఎస్ అధ్యక్షుడు, సీఎం కేసీఆర్ ఈ నెల 26, 27 తేదీల్లో మహారాష్ట్ర పర్యటనకు వెళ్లనున్నారు. షోలాపూర్ జిల్లా పండరిపూర్‌లోని విఠోభారుక్మిణి మందిరంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. సోమవారం ఉదయం రోడ్డు మార్గంలో షోలాపూర్ చేరుకుంటారు. ఆయన వెంట మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు ఇతర ప్రజా ప్రతినిధులు ఉంటారు. భారీ కాన్వాయ్‌తో మహారాష్ట్రలోని షోలాపూర్ చేరుకొని, రాత్రికి అక్కడే బస చేస్తారు.
తెలంగాణ నుంచి వెళ్లిన చేనేత కార్మికులు, బీఆర్ఎస్ నేతల కుటుంబాలను సీఎం కేసీఆర్ కలుస్తారు. విఠలేశ్వరుడి దర్శనం అనంతరం షోలాపూర్ జిల్లాలో ప్రముఖ నాయకుడు భగీరథ్ బాల్కేతో పాటు పలువురు సీఎం కేసీఆర్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరనున్నారు. అక్కడ బీఆర్ఎస్ నాయకులను ఉద్దేశించి మాట్లాడనున్నారు. ఇక తిరుగు ప్రయాణంలో దారాశివ్ జిల్లాలోని శక్తిపీఠమైన తుల్జాభవానీ అమ్మవారిని దర్శించుకొని ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ తర్వాత హైదరాబాద్ చేరుకుంటారని పార్టీ వర్గాలు చెప్పాయి.
బీఆర్ఎస్‌లో చేరిన మహారాష్ట్ర నేతలు
మహారాష్ట్రలో బీఆర్ఎస్ ప్రభంజనం కొనసాగుతున్నది. అనేక మంది నేతలు పార్టీలోకి చేరుతున్నారు. ఈ క్రమంలో చంద్రాపూర్ జిల్లాకు చెందిన ఎన్సీపీ, కాంగ్రెస్, బీజేపీకి చెందిన పలువురు నేతలు మంత్రి హరీశ్ రావు, ప్రభుత్వ విప్ బాల్క సుమన్ సమక్షంలో బీఆర్ఎస్‌లో చేరారు. వీరిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించి గులాబీ కండువాలు కప్పారు. ఎన్సీపీ మహారాష్ట్ర సోషల్ జస్టీస్ విభాగం ఉపాధ్యక్షుడు సునీల్ దహెగావ్‌కర్, చంద్రాపూర్ జిల్లా అధ్యక్షుడు ప్రియదర్శన్ అజయ్ ఇంగ్లే, గుగ్గుస్ నగర అధ్యక్షుడు దిలీప్ పిట్టల్వార్, చంద్రాపూర్ జిల్లా నేషనలిస్ట్ యూత్ కాంగ్రెస్ కార్యదర్శి హేమంత్ సింగ్ తదితరులు పార్టీలో చేరారు.