సున్నితమైన సమాచారం బీజేపీ సోషల్ మీడియాలో ఎలా?
కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలపై పార్లమెంట్ సమావేశాల్లో గట్టిగా గళమెత్తాలని టీఆర్ఎస్ పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ సూచించారు. కలిసి వచ్చే విపక్షాలతో కేంద్రంపై పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. తెలంగాణ అభివృద్ధి చూసి మోడీకి కళ్లు ఎర్రబడ్డాయన్నారు. తెలంగాణ రాష్ట్రంపై కేంద్రం కక్షపూరిత వైఖరితో వ్యవహరిస్తోందని ఆరోపించారు. నిబంధనల పేరుతో ఆర్థికంగా ఇబ్బందులు పెట్టి తెలంగాణ రాష్ట్రాన్ని అణచివేసేందుకు మోడీ కుట్ర చేస్తున్నారని కేసీఆర్ ఫైరయ్యారు.
తెలంగాణ కంటే 22 రాష్ట్రాల అప్పులే అధికంగా ఉన్నాయని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఎల్లుండి నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో అనుసరించాల్సిన వ్యూహంపై పార్టీ ఎంపీలకు సీఎం కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఉండాల్సిన కీలకమైన, సున్నితమైన సమాచారం బీజేపీ నేతలకు ఎలా చేరుతోందని కేసీఆర్ ప్రశ్నించారు.








కేంద్ర ప్రభుత్వ నిర్ణయాలు బీజేపీ సోషల్ మీడియాలో ముందే తిరుగుతున్నాయని, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య గోప్యంగా ఉండాల్సిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వమే ఉద్దేశపూర్వకంగా లీక్ చేస్తోందని కేసీఆర్ ఆరోపించారు. ఆర్థిక వ్యవహారాలను లీక్ చేయడం అన్నది నేరపూరితమైన చర్యగా అభివర్ణించారు.
తెలంగాణ రాష్ట్రానికి వ్యతిరేకంగా ప్రచారం చేయడం బీజేపీ దివాలా కోరుతనానికి నిదర్శనమన్నారు. ఈ ఎనిమిదేళ్ల కాలంలో తెలంగాణ రాష్ట్రం నుంచి కేంద్ర ప్రభుత్వానికి అందిన నిధులు ఎన్ని.. తిరిగి కేంద్రం నుంచి తెలంగాణకు కేటాయించిన నిధులు ఎన్ని అన్న వివరాలను బయట పెడితే సామాన్యులకు కూడా కేంద్ర ప్రభుత్వ వైఖరి ఏంటో ఇట్టే అర్థమవుతుందని కేసీఆర్ వ్యాఖ్యానించారు.
అప్పులకు సంబంధించి రాష్ట్ర ఎఫ్‌ఆర్‌బీఎం పరిధిని తొలుత పెంచి ఆ తరువాత తగ్గించడం వెనుక ఉద్దేశం ఏంటని నిలదీశారు. రుణ పరిమితిని 25 వేల కోట్లకు కుదించడం కుట్రపూరితం కాదా..? అని ఫైర్ అయ్యారు. తొలుత తెలంగాణ ఎఫ్‌ఆర్‌బీఎం లిమిట్ రూ.53వేల కోట్లు అని ప్రకటించిన కేంద్రం.. ఆ తర్వాత హఠాత్తుగా 25 వేల కోట్లకు కుదించడం కుట్ర కాదా అని కేసీఆర్ నిలదీశారు. దేశంలో అత్యధికంగా అభివృద్ధి సాధిస్తూ కేవలం ఎనిమిది రాష్ట్రాలు మాత్రమే దేశ జీడీపీకి అత్యధికంగా కంట్రీబ్యూట్ చేస్తున్నాయని, ఆ ఎనిమిది రాష్ట్రాల్లో తెలంగాణ రాష్ట్రం కూడా ఒక్కటి అని సీఎం గుర్తు చేశారు.
విద్యుత్ సంస్కరణల అమలు కోసం కేంద్ర ప్రభుత్వం చేస్తున్న ఒత్తిడి పై పార్లమెంటు వేదికగా ఎదురు తిరగాలని ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తెలంగాణ అభివృద్ధిని ప్రధాని మోడీ ఎప్పుడూ ప్రోత్సహించలేదని, అభివృద్ధిని అడ్డుకోవడమే పనిగా నరేంద్ర మోడీ పని చేస్తున్నారని ఎంపీల సమావేశంలో కేసీఆర్ వ్యాఖ్యానించారు.