Telugu Global
Telangana

సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం

విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ సచివాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించారు.

సంస్కృత విశ్వవిద్యాలయం ఏర్పాటుకు సీఎం కేసీఆర్ నిర్ణయం
X

సమైక్య పాలనలో విస్మరించబడిన తెలంగాణ ఆధ్యాత్మిక ప్రాశస్త్యాన్ని పునరుజ్జీవింప చేసుకోవాలని సీఎం కేసీఆర్ అన్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో శనివారం పలు అంశాలపై సీఎం కేసీఆర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. విస్మరణకు గురైన మల్లినాథ సూరి వంటి అలనాటి ప్రముఖ కవులు, పండితులు, మహనీయుల ఘన చరిత్రలను వెలికి తీయాల్సిన అవసరం ఉందని కేసీఆర్ సమావేశంలో చెప్పారు. ఈ క్రమంలోనే రాష్ట్రంలో ఒక సంస్కృత విశ్వ విద్యాలయాన్ని ఏర్పాటు చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. మల్లినాథుని జన్మ స్థలమైన మెదక్ జిల్లా కొల్చారంలో ఈ విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. ఈ విశ్వ విద్యాలయం ఏర్పాటుకు సంబంధించిన కార్యచరణను వెంటనే ప్రారంభించాలని రాష్ట్ర విద్యా శాఖ మంత్రి సబిత ఇంద్రారెడ్డికి సీఎం కేసీఆర్ సచివాలయం నుంచి ఫోన్ చేసి ఆదేశించారు.

31న బ్రాహ్మణ పరిషత్ భవనం ప్రారంభోత్సవం..

ఈన నెల 31న తెలంగాణ ప్రభుత్వం నిర్మించిన బ్రాహ్మణ పరిషత్ భవనాన్ని ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా చండీయాగం, సుదర్శన యాగాలను నిర్వహించాలని బ్రాహ్మణ పరిషత్ చైర్మన్ డాక్టర్ కేవీ రమణాచారికి సీఎం కేసీఆర్ సూచించారు. భవన ప్రారంభానికి అన్ని రాష్ట్రాలు, ప్రముఖ పుణ్య క్షేత్రాల నుంచి అర్చకులను, దేశవ్యాప్తంగా ఉన్న కంచి కామకోటి పీఠాధిపతులను, బ్రాహ్మణ ప్రజాప్రతినిధులను ఆహ్వానించాలని సీఎం తెలిపారు. ఈ కార్యక్రమానికి వచ్చే వారి ప్రయాణానికి, బసకు సంబంధించిన ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.

ఒకనాడు సమైక్య పాలనలో అలజడులు, అశాంతికి నెలవుగా ఉన్న తెలంగాణ.. ఇవాళ రాష్ట్ర ప్రభుత్వ కృషి, దైవ కృపతో ఎటు చూసినా పచ్చని పంట పొలాలు, ప్రశాంతమైన వాతావరణంలో ఉన్నదని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి చెందుతున్న దేవాలయాలు, ప్రార్థనా మందిరాలతో శాంతి నెలకొన్నదని కేసీఆర్ చెప్పారు.

ప్రజలకు ఏ కష్టం వచ్చినా అక్కడకు వెళ్లి ప్రజా ప్రతినిధులు, ప్రభుత్వ యంత్రాంగం వారి సంక్షేమం కోసం పని చేస్తున్నారు. అన్ని వర్గాల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం పని చేస్తుందని కేసీఆర్ చెప్పారు. పూజారులు, పేద బ్రాహ్మణ వర్గాల సంక్షేమానికి పాటు పడుతోందని అన్నారు.

ప్రభుత్వం అందించిన సహకారంతో పూజారి వృత్తినే నమ్ముకున్న పేద బ్రాహ్మణ పిల్లలకు చక్కటి చదువు అందుతున్నది. వేదాలు చదువుతూ దైవకార్యంలో మునిగిన తమను కూడా పట్టించుకునే ప్రభుత్వం వున్నదనే భరోసా అర్చకుల్లో పెరిగింది. పేద బ్రాహ్మణ వర్గానికి తెలంగాణ రాష్ట్రం చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు దేశంలోని మరే రాష్ట్రంలో కూడా అమలుకావడంలేదని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.


First Published:  14 May 2023 8:03 AM IST
Next Story