నోట్ల కట్టల ఆసాములకు బుద్ధి చెప్పాల్సిందే..
సీతారామ ప్రాజెక్టు 70 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే వైరాతో పాటు మరిన్ని ప్రాంతాలకు ఏడాది పొడవునా నీళ్లుంటాయని చెప్పారు సీఎం కేసీఆర్.
ఎన్నికలనగానే అప్పటికప్పుడు హడావిడిగా ఓట్లకోసం వచ్చే నోట్ల కట్టల ఆసాములకు.. కోట్ల విలువైన మీ ఓటుతో బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్. వైరా నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన.. మదన్ లాల్ కు భారీ మెజార్టీ ఇవ్వాలన్నారు. ఇక్కడున్న కొంతమంది ప్రతిపక్ష నేతలు అహంకారంతో మాట్లాడుతున్నారని, బీఆర్ఎస్ అభ్యర్థుల్ని అసెంబ్లీ గడప తొక్కనీయం అంటున్నారని.. తమ పార్టీ అభ్యర్థుల్ని అసెంబ్లీ గడప తొక్కనివ్వను అనడానికి వాడెవడు అని ప్రశ్నించారు కేసీఆర్. అసెంబ్లీకి ఎవర్ని పంపించాలో నిర్ణయించేది ప్రజలు అని, ప్రజల దగ్గర ఓటు అనే కోట్ల విలువైన సాధనం ఉందని, ఆ ఓటుతో.. నోట్ల కట్టల ఆసాములకు బుద్ధి చెప్పాలన్నారు కేసీఆర్.
గత ఎన్నికల్లో వైరా నుంచి ఇండిపెండెంట్ గా పోటీ చేసి గెలిచారు రాములు నాయక్. ఆ తర్వాత ఆయన బీఆర్ఎస్ లో చేరారు. ఈ ఏడాది టికెట్ వస్తుందని ఆయన ఆశించారు కానీ.. సీఎం కేసీఆర్ మాత్రం మదన్ లాల్ కి అవకాశమిచ్చారు. అయితే రాములు నాయక్ ఇక్కడ అడ్జస్ట్ అయిపోయారు. రాములు నాయక్ చాలా గొప్ప మనిషని, తాను రిక్వెస్ట్ చేసి ఈసారి మదన్ లాల్ కు అవకాశం ఇవ్వమంటే ఆయన పెద్ద మనసుతో సహకరించారని చెప్పారు కేసీఆర్. ఏ మాత్రం విబేధించకుండా రాములు నాయక్ సహృదయంతో పని చేస్తున్నారన్నారు. రాములు నాయక్ కి కూడా సముచితమైన గౌరవం ఇస్తామని హామీ ఇచ్చారు కేసీఆర్.
సీతారామ ప్రాజెక్టు 70 శాతం పనులు పూర్తయ్యాయని, ఆ ప్రాజెక్ట్ అందుబాటులోకి వస్తే వైరాతో పాటు మరిన్ని ప్రాంతాలకు ఏడాది పొడవునా నీళ్లుంటాయని చెప్పారు సీఎం కేసీఆర్. పంటలకు ఢోకా ఉండదని, 40 వేల ఎకరాలకు నీళ్లు వస్తాయన్నారు. చిన్న లిఫ్ట్ పెట్టుకుంటే ఎత్తైన ప్రాంతాలకు కూడా నీళ్లు పారుతాయన్నారు. ఖమ్మం జిల్లాను ఒరుసుకుంటూ గోదావరి పోతుందని, గతంలో ఒక్క ముఖ్యమంత్రి కూడా గోదావరి నీళ్లు తెచ్చుకుందామని ఆలోచించలేదని.. వారి రాష్ట్రం కాదు కాబట్టి.. వారికి ఆ కడుపు నొప్పి ఉండదన్నారు. బీఆర్ఎస్ హయాంలోనే ఖమ్మం జిల్లాను పట్టించుకున్నామని చెప్పారు. జూలూరుపాడు, కారేపల్లి, ఏన్కూరు, ఇల్లెందులో కరువు ఎందుకు ఉండాలని సీతారామ ప్రాజెక్టు కడుతున్నామని వివరించారు కేసీఆర్.