స్పీడు పెంచిన కేసీఆర్.. ఇవాళ 4 సభలు
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్.

పోలింగ్ డేట్ సమీపిస్తుండటంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రచారంలో స్పీడు పెంచారు. నియోజకవర్గాల్లో సుడిగాలి పర్యటనలు చేస్తూ బీఆర్ఎస్ అభ్యర్థులకు ప్రజల మద్దతు కూడగడుతున్న కేసీఆర్.. ఇవాళ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని 4 నియోజకవర్గాలను చుట్టేయనున్నారు. బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించాలని ఓటర్లను అభ్యర్థించనున్నారు. ఇందుకోసం మధ్యాహ్నం 12 గంటల 40 నిమిషాలకు ప్రగతి భవన్ నుంచి బయల్దేరనున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని దేవరకద్ర నియోజకవర్గంలో పార్టీ అభ్యర్థి ఆల వెంకటేశ్వర రెడ్డికి మద్దతుగా ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు కేసీఆర్. ఆ తర్వాత గద్వాల్‌లో బండ్ల కృష్ణమోహన్ రెడ్డికి మద్దతుగా ప్రచారం చేస్తారు. తర్వాత మక్తల్, నారాయణపేటల్లో నిర్వహించే ప్రజా ఆశీర్వాద సభల్లో కేసీఆర్ పాల్గొంటారు.
2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నాలుగు నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. ఈసారి కూడా హిస్టరీ రిపీట్ చేయాలని భావిస్తోంది బీఆర్ఎస్. ఇక ప్రచారంలో భాగంగా గత తొమ్మిదన్నరేళ్ల పాలనలో చేసిన సంక్షేమం, అభివృద్ధిని ప్రజలకు వివరిస్తున్నారు కేసీఆర్. కాంగ్రెస్ పాలనలో తెలంగాణ ఎలా మోసపోయింది, గోస పడింది అన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా చెప్తున్నారు. ప్రత్యర్థులపై తనదైన శైలిలో సెటైర్లు వేస్తున్నారు.