Telugu Global
Telangana

రేపు నిమ్స్ నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్

రూ.1,571 కోట్ల వ్యయంతో 32 ఎకరాల విస్తీర్ణంలో భారీ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాకును నిర్మించనున్నారు. దశాబ్ది ఉత్సవాల వేళ ఈ భారీ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.

రేపు నిమ్స్ నూతన ఆసుపత్రి భవనానికి శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
X

వైద్య రంగానికి తెలంగాణ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. రాష్ట్రంలోని పేదలు, సామాన్య ప్రజలకు కూడా కార్పొరేట్ స్థాయి వైద్యాన్ని అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో హైదరాబాద్, వరంగల్ నగరాల్లో సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను నిర్మిస్తోంది. ఈ క్రమంలో ఎప్పటి నుంచో స్పెషాలిటీ వైద్య సేవలను అందిస్తున్న హైదరాబాద్‌లోని నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రిని భారీగా విస్తరించాలని నిర్ణయించింది. ప్రస్తుతం 30 పైగా విభాగాలతో నిమ్స్ వైద్య సేవలను అందిస్తున్నది. దీనికి అదనంగా మరో 2వేల పడకల ఆసుపత్రి భవనాన్ని నిర్మించనున్నాది. ఈ భవనం పూర్తయితే ప్రభుత్వ రంగంలో దేశంలోనే అతిపెద్ద ఆసుపత్రి భవనంగా రికార్డు సృష్టించనున్నది.

రూ.1,571 కోట్ల వ్యయంతో 32 ఎకరాల విస్తీర్ణంలో భారీ సూపర్ స్పెషాలిటీ ఎంసీహెచ్ బ్లాకును నిర్మించనున్నారు. దశాబ్ది ఉత్సవాల వేళ ఈ భారీ భవనానికి సీఎం కేసీఆర్ శంకుస్థాపన చేయనున్నారు. బుధవారం (జూన్ 14)న కొత్త బ్లాక్ నిర్మాణానికి భూమిపూజ చేస్తారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లను వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. ఈ నూతన బ్లాక్‌కు 'దశాబ్ది' అనే పేరు పెట్టనున్నట్లు తెలుస్తున్నది. ఈ భారీ భవన నిర్మాణ బాధ్యతలను ఆర్ అండ్ బీ శాఖ చేపట్టనున్నది.

కొత్త భవనంలో మొత్తం నాలుగు బ్లాకులు ఉంటాయి. ఓపీ కోసం ఒకటి, ఐసీ సేవల కోసం మరొక రెండు బ్లాక్‌లు, ఎమర్జెన్సీ సేవల కోసం ప్రత్యేకమైన బ్లాక్‌ నిర్మిస్తారు. ఓపీ, ఎమర్జెన్సీ బ్లాక్‌లలో లోయర్ గ్రౌండ్, గ్రౌండ్ ఫ్లోర్‌తో పాటు ఎనిమిది అంతస్థులు నిర్మించనున్నారు. ఐపీ బ్లాక్‌లో ఒక్కో దానిలో 15 ఫ్లోర్‌ను ఉండనున్నాయి. 120 ఓపీ గదులు, 1200 ఆక్సిజన్ బెడ్లు, 500 ఐసీయూ బెడ్లు కొత్త భవంతిలో అందుబాటులోకి రానున్నాయి.

కొత్త భవనంలో 32 మాడ్యులర్ ఆపరేషన్ థియేటర్లు, 6 మేజర్ మాడ్యులార్ థియేటర్లు ఏర్పాటు చేయనున్నారు. కొత్త భవనంలో అందుబాటులోకి వచ్చే బెడ్లతో కలిపి.. మొత్తం నిమ్స్‌లో బెడ్ల సంఖ్య 4 వేలకు చేరుకోనున్నాయి.

First Published:  13 Jun 2023 11:30 AM IST
Next Story