రూ.1,571 కోట్లతో నిమ్స్ విస్తరణ.. శంకుస్థాపన చేయనున్న సీఎం కేసీఆర్
నిమ్స్ కోసం 33 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు.
తెలంగాణ ప్రభుత్వం వైద్య రంగంపై ఎక్కువ దృష్టి పెట్టింది. రాష్ట్రంలోని ప్రజలందరికీ ఖరీదైన వైద్యం అందుబాటులో ఉంచాలనే లక్ష్యంతో సీఎం కేసీఆర్ పలు కొత్త ఆసుపత్రుల నిర్మాణానికి నిధులు కేటాయించారు. వరంగల్ హెల్త్ సిటీ సహా.. హైదరాబాద్‌లో నాలుగు టిమ్స్ ఆసుపత్రులు శర వేగంగా నిర్మాణం జరుపుకుంటున్నాయి. త్వరలోనే ఈ ఆసుపత్రుల ద్వారా సూపర్ స్పెషాలిటీ సేవలు ప్రజలకు అందుబాటులోకి రానున్నాయి.
మరోవైపు నిజాం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (నిమ్స్) ఆసుపత్రికి నిత్యం రోగుల తాకిడి ఎక్కువవుతోంది. రోజురోజుకూ ఇక్కడికి వైద్యం కోసం వచ్చే వారి సంఖ్య పెరిగి పోతుండటంతో స్థలం సరిపోవడం లేదు. ప్రస్తుతం నిమ్స్‌లో ఔట్ పేషెంట్ విభాగంలోనే 2 వేల నుంచి 3వేల మంది రోగులను చూస్తున్నారు. ఈ రద్దీకి పాత భవనం సరిపోవడం లేదు. భవిష్యత్‌లో ఈ సంఖ్య మరింతగా పెరిగే అవకాశం ఉన్నది. అందుకే ఓపీ సేవల కోసం ప్రత్యేకంగా బ్లాక్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఎనిమిది అంతస్తుల్లో స్పెషాలిటీ సేవల కోసం ఓపీ భవనాన్ని నిర్మించనున్నారు.
నిమ్స్ కోసం 33 ఎకరాల్లో విస్తరణ పనులు చేపట్టనున్నట్లు మంత్రి హరీశ్ రావు తెలిపారు. 2 వేల పడకల సామర్థ్యంతో కొత్తగా మూడు బ్లాకులు నిర్మిస్తారు. ఒక బ్లాక్ ఓపీ కోసం.. మిగిలినవి ఐపీ, ఎమర్జెన్సీ సేవల కోసం ఉపయోగిస్తామని మంత్రి వెల్లడించారు. రూ.1,571 కోట్లతో చేపట్టనున్న విస్తరణ పనులకు సీఎం కేసీఆర్ వచ్చే నెలలో శంకుస్థాపన చేస్తారని హరీశ్ రావు చెప్పారు. కొత్త భవనంలో 30 ఆపరేషన్ థియేటర్లతో పాటు 2000 పడకలు కూడా ఏర్పాటు చేయనున్నారు.
1200 ఆక్సిజన్ బెట్లు, 500 ఐసీయూ బెడ్లతో పాటు 300 పేయింగ్ రూమ్ బెడ్లు కూడా అందుబాటులోకి రానున్నాయి. ప్రస్తుతం 30 రకాల విభాగాలు నిమ్స్‌లో సేవలు అందిస్తుండగా.. విస్తరణ అనంతరం వీటి సంఖ్య 35కు చేరనున్నది. ఇప్పటి వరకు ప్రసూతి సేవలను నిమ్స్ అందించడం లేదు. విస్తరణ తర్వాత గైనకాలజీ విభాగం కూడా అందుబాటులోకి రానున్నది.