Telugu Global
Telangana

మే 4న ఢిల్లీ బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తున్నది.

మే 4న ఢిల్లీ బీఆర్ఎస్ శాశ్వత కార్యాలయం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

భారత్ రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఢిల్లీలో నిర్మించిన శాశ్వత పార్టీ కార్యాయం మే 4న ప్రారంభం కానున్నది. టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్‌గా మారిన తర్వాత సీఎం కేసీఆర్ జాతీయ రాజకీయాలపై పూర్తిగా దృష్టి పెట్టారు. ఈ క్రమంలో ఢిల్లీలో పార్టీ కోసం ఒక శాశ్వత కార్యాలయం ఉండాల్సిన అవసరాన్ని గుర్తించారు. ఈ క్రమంలో పార్టీ కోసం వసంత్ విహార్‌లో భవన నిర్మాణాన్ని ప్రారంభించిన ఐదు నెలల్లోనే పూర్తి చేశారు. మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి కొత్త భవన నిర్మాణ పనులను పర్యవేక్షించారు.

బీఆర్ఎస్ పార్టీ కోసం తొలుత ఢిల్లీలోని సర్దార్ పటేల్ మార్గ్‌లో తాత్కాలిక కార్యాలయాన్ని డిసెంబర్ 14న కేసీఆర్ ప్రారంభించారు. ఇది కేవలం ఒక గుర్తింపు కోసం మాత్రమే ఏర్పాటు చేసినట్లు అప్పుడే పార్టీ వర్గాలు వివరించాయి. తాజాగా శాశ్వత భవనం పూర్తి కావడంతో మే 4న అట్టహాసంగా పార్టీ కార్యాలయం ప్రారంభించాలని నిర్ణయించారు. సీఎం కేసీఆర్ చేతుల మీదుగా ఈ భవనాన్ని ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో పార్టీ ఎంపీలతో పాటు ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు పాల్గొంటారని తెలుస్తున్నది.

బీఆర్ఎస్ జాతీయ స్థాయి కార్యకలాపాలన్నీ కేంద్ర కార్యాలయం నుంచే నడువనున్నాయి. వివిధ పార్టీలను ఒకే వేదిక మీదకు తీసుకొని రావడం, సదస్సులు, సమావేశాలు నిర్వహించడానికి పార్టీ కార్యాలయాన్ని ఉపయోగించనున్నారు. ఇకపై ఢిల్లీలోని కేంద్ర కార్యాలయం అనేక జాతీయ స్థాయి చర్చలకు వేదికగా పని చేయనున్నదని చెప్పారు.

కాగా, గురువారం తెలంగాణ భవన్‌లో నిర్వహించిన రాష్ట్ర ప్రతినిధుల సభలోనే కేసీఆర్ ఈ విషయాన్ని వెల్లడించారు. ఆసక్తి ఉన్న ప్రజాప్రతినిధులు ఎవరైనా ఈ కార్యక్రమానికి హాజరు కావొచ్చని కూడా చెప్పారు. జాతీయ రాజకీయాలకు ఇకపై బీఆర్ఎస్‌కు ఒక మంచి వేదిక ఉందని.. పార్టీ కార్యక్రమాలకు ముందుకు తీసుకెళ్లడానికి, ఢిల్లీలో ఒక గుర్తింపు రావడానికి ఉపయోగపడుతుందని కేసీఆర్ చెప్పారు.


First Published:  28 April 2023 8:26 AM IST
Next Story