జూన్‌లో అమరవీరుల స్మారకం ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
సీఎం కేసీఆర్ ఎంతో చొరవ తీసుకొని దీని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. తెలంగాణ అమరవీరుల త్యాగం ప్రతిబింభిచేలా ఈ నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్‌లోని సెక్రటేరియట్ ఎదుట నిర్మిస్తున్న తెలంగాణ అమర వీరుల స్మారకం జూన్ నెలలో ప్రారంభం కానున్నదని రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి వెల్లడించారు. ట్యాంక్‌బండ్ సమీపంలో లుంబినీ పార్క్ పక్కనే ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న అమరవీరుల స్మారకాన్ని శుక్రవారం మంత్రి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..
అమరవీరుల స్మారకాన్ని అరుదైన స్టెయిన్ స్టీల్‌తో అన్ని రకాల అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో, సకల హంగులతో నిర్మించామని తెలిపారు. దీని నిర్మాణం కోసం అరుదైన స్టెయిన్ లెస్ స్టీల్‌ను ఉపయోగించామని, ప్రపంచంలోనే ఇలాంటి మెటీరియల్ ఉపయోగించి నిర్మించిన అతిపెద్ద కట్టడం ఇదేనని పేర్కొన్నారు. దీని నిర్మాణం పూర్తయిన తర్వాత ఎవరు చూసినా.. తెలంగాణ కోసం చేసిన అమరవీరుల త్యాగం గుర్తుకు వస్తుందని అన్నారు.
సీఎం కేసీఆర్ ఎంతో చొరవ తీసుకొని దీని ఏర్పాట్లను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారని.. తెలంగాణ అమరవీరుల త్యాగం ప్రతిబింభిచేలా ఈ నిర్మాణాన్ని చేపట్టామని మంత్రి తెలిపారు. మొన్న రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ భారీ విగ్రహం ఆవిష్కరించుకొని.. నిన్న సచివాలయం ప్రారంభించుకున్నాము. ఇక త్వరలో అమరవీరుల స్మారకాన్ని ప్రారంభించుకోబోతున్నాము. ఇవన్నీ తెలంగాణ రాష్ట్రానికి ప్రతీకలుగా నిలవబోతున్నాయని మంత్రి ప్రశాంత్ రెడ్డి చెప్పారు.
కాగా, అంతకు ముందు మంత్రి ప్రశాంత్ రెడ్డి అక్కడ జరుగుతున్న నిర్మాణ పనులను పర్యవేక్షించారు. ప్రధాన ద్వారం, ల్యాండ్ స్కేప్ ఏరియా, పార్కింగ్ ఏరియా, తెలంగాణ తల్లి విగ్రహం. ఫౌంటైన్ ఏరియా, గ్రానైట్ ఫ్లోరింగ్, ఫొటో గ్యాలరీ, ఏవీ రూం, లిఫ్ట్‌లు, ఎస్కలేటర్లు, కన్వెన్షన్ సెంటర్, రెస్టారెంట్ పనులతో పాటు.. అమర వీరుల స్మారకంలో నిరంతరం వెలిగే జ్యోతి ఆకృతి పనులను పరిశీలించారు.