Telugu Global
Telangana

కొత్త సెక్రటేరియట్‌లో గుడి, మసీదు, చర్చిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్

తాజాగా ఈ మూడు కట్టడాల నిర్మాణాలు పూర్తి కావడంతో భక్తులకు అందుబాటులోకి తీసుకొని రావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది.

కొత్త సెక్రటేరియట్‌లో గుడి, మసీదు, చర్చిని ప్రారంభించనున్న సీఎం కేసీఆర్
X

తెలంగాణ పరిపాలనా కేంద్రమైన డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో సర్వమతాలకు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ప్రభుత్వం గుడి, మసీదు, చర్చిలను నిర్మించింది. సర్వ మతాలను గౌరవించాలనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం.. సచివాలయ నిర్మాణ సమయంలోనే మసీదు, గుడి, చర్చికి స్థలాలు కేటాయించింది. నూతన సచివాలయాన్ని ఏప్రిల్ 30నే ప్రారంభించినా.. అందులో గుడి, మసీదు, చర్చిల నిర్మాణం పూర్తి కాకపోవడంతో అవి ఓపెన్ చేయలేదు.

తాజాగా ఈ మూడు కట్టడాల నిర్మాణాలు పూర్తి కావడంతో భక్తులకు అందుబాటులోకి తీసుకొని రావాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. ఆగస్టు 25న ముఖ్యమంత్రి కేసీఆర్ చేతుల మీదుగా సర్వ మతాలకు చెందిన ప్రతినిధుల సమక్షంలో ఈ నిర్మాణాలను ఓపెన్ చేయనున్నారు. మరో వారంలోపే వీటి ప్రారంభం ఉండటంతో.. రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి శనివారం అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు.

ప్రార్థనా మందిరాల నిర్మాణం, అక్కడకు చేరవేసే రోడ్లు, ఇతర సౌకర్యాలను పరిశీలించారు. పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. తెలంగాణ అంటే గంగా-జమునా తెహజీబ్ అనే స్పూర్తిని కొనసాగిస్తూ సర్వమతాల ప్రార్థనాలయాలను ఇక్కడ నిర్మిస్తున్నట్లు చెప్పారు. సచివాలయంలోని గుడిలో శివుడు, గణపతి, పోచమ్మ, హనుమంతుడి ఆలయాలు ఉన్నట్లు ఆయన తెలిపారు. ఇందుకోసం తిరుపతి నుంచి ప్రత్యేకంగా విగ్రహాలను తెప్పించినట్లు వివరించారు. మసీదు, చర్చి ప్రారంభంలో ఆయా మతాల మతాధికారులు పాల్గొంటారని మంత్రి చెప్పారు.

26న మొక్కలు నాటనున్న సీఎం కేసీఆర్..

స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల ముగింపు కార్యక్రమం నేపథ్యంలో ఈ నెల 26న రంగారెడ్డి జిల్లా మంచిరేవుల ఫారెస్ట్ ట్రెక్ పార్కులో సీఎం కేసీఆర్ మొక్కలు నాటుతారని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తెలిపారు. ఇందుకు అవసరమైన ఏర్పాట్లను చేయాలని ఆమె అధికారులను ఆదేశించారు. ఈ మేరకు శనివారం మంచిరేవులలో పర్యటించి.. అధికారులకు తగిన సూచనలు చేశారు.


First Published:  19 Aug 2023 9:47 PM IST
Next Story