Telugu Global
Telangana

అంబేద్కర్ విగ్రహాం వద్దే.. సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్?

విగ్రహం వద్దే సీఎం కేసీఆర్ సభ పెడితే బాగుంటుందని, ప్రజలు విగ్రహాన్ని చూడటానికి అక్కడికి రావడానికే ఆసక్తి చూపుతారని మంత్రుల కమిటీ సూచించినట్లు తెలుస్తున్నది.

అంబేద్కర్ విగ్రహాం వద్దే..  సీఎం కేసీఆర్ పబ్లిక్ మీటింగ్?
X

హైదరాబాద్ నగరంలో ఏర్పాటు చేస్తున్న 125 అడుగుల ఎత్తైన భారీ అంబేద్కర్ విగ్రహాన్ని ఏప్రిల్ 14న సీఎం కేసీఆర్ ఆవిష్కరించనున్నారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జయంతి రోజునే ఈ కార్యక్రమాన్ని నిర్వహించనుండటంతో.. పలు రాష్ట్రాల సీఎంలు, జాతీయ నాయకులను పిలిచి ఎన్టీఆర్ స్టేడియంలో లేదా ఎల్బీ స్టేడియంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేయాలని భావించారు. అయితే సీఎం కేసీఆర్ తన నిర్ణయాన్ని మార్చుకున్నట్లు తెలుస్తున్నది. భారీ అంబేద్కర్ విగ్రహం వద్దే పబ్లిక్ మీటింగ్ ఏర్పాటు చేయాలని అనుకుంటున్నట్లు ప్రభుత్వ వర్గాలు అంటున్నాయి.

అంబేద్కర్ విగ్రహ నిర్మాణ కమిటీలోని మంత్రులు టి. హరీశ్ రావు, కేటీఆర్, కొప్పుల ఈశ్వర్, వేముల ప్రశాంత్ రెడ్డి, మహమూద్ అలీ, తలసాని శ్రీనవాస్ యాదవ్ కూడా ఇదే సూచన చేసినట్లు సమాచారం. విగ్రహం వద్దే సీఎం కేసీఆర్ సభ పెడితే బాగుంటుందని, ప్రజలు విగ్రహాన్ని చూడటానికి అక్కడికి రావడానికే ఆసక్తి చూపుతారని సూచించినట్లు తెలుస్తున్నది. అయితే ఈ విషయంపై మంగళవారం జరిగే సమావేశంలో సీఎం కేసీఆర్ తుది నిర్ణయం తీసుకోనున్నారు.

అంబేద్కర్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎంలు ఎంకే స్టాలిన్, అరవింద్ కేజ్రివాల్, సమాజ్ వాదీ పార్టీ చీఫ్ అఖిలేశ్ యాదవ్ తదితరులను పిలవాలని మొదట భావించారు. సీఎం కేసీఆర్ ఆ నిర్ణయాన్ని కూడా విరమించుకున్నట్లు తెలుస్తున్నది. విగ్రహావిష్కరణకు జాతీయ, రాష్ట్ర దళిత నాయకులను మాత్రమే పిలవాలని కేసీఆర్ నిర్ణయించారు. వీరితో పాటు అంబేద్కర్ మనుమడు ప్రకాశ్ అంబేద్కర్‌ను కూడా ఇన్వైట్ చేయనున్నారు. విగ్రహావిష్కరణ సందర్భంగా రాష్ట్రంలో దళితుల కోసం అమలు చేస్తున్న పథకాలను దేశమంతా తెలిసేలా ప్రచారం చేయనున్నారు. ముఖ్యంగా దళిత బంధు పథకాన్ని హైలైట్ చేయాలని నిర్ణయించారు.

ఆ రోజు జరిగే కార్యక్రమానికి రావాలని ఇప్పటికే పలువురు దళిత బంధు లబ్దిదారులకు, దళిత సంఘాలకు చెందిన ప్రతినిధులకు సమాచారం ఇచ్చినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ చెప్పారు. దేశంలో దళితుల కోసం ప్రత్యేకంగా దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణే. దీనిపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయని కొప్పుల ఈశ్వర్ అన్నారు.

ఇక ఏప్రిల్ 14న సభ తర్వాత ఏప్రిల్ 27న బీఆర్ఎస్ పార్టీ ప్రతినిధుల సభ జరుగనున్నది. ఏప్రిల్ 30న పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలతో పాటు కొత్త సచివాలయం ప్రారంభోత్సవం కూడా ఉండనున్నది.

First Published:  4 April 2023 3:56 AM GMT
Next Story