30న కొత్త సచివాలయంలోకి సీఎం కేసీఆర్.. తొలి సంతకం పెట్టేది ఏ ఫైల్‌పై అంటే..
కొత్త సెక్రటేరియట్‌లోని ఆరవ అంతస్థులో సీఎం కేసీఆర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఆసీనులవుతారు.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయం ఈ నెల 30 ప్రారంభం కానున్నది. రూ.610 కోట్ల వ్యయంతో అత్యంత ఆధునిక వసతులతో నిర్మించిన ఈ భవనాన్ని.. సీఎం కేసీఆర్ ప్రారంభించనున్నారు. తొలి రోజు ప్రత్యేక యాగం నిర్వహించడంతో పాటు.. పూజలు జరిపిన అనంతరం సీఎం కేసీఆర్ సహా, మంత్రులు, అధికారులు వారి స్థానాల్లో ఆసీనులు కానున్నారు. అదే రోజు తాత్కాలిక సెక్రటేరియట్‌గా పని చేస్తున్న బీఆర్కే భవన్‌లో కార్యకలాపాలు నిలిచిపోనున్నాయి.
కొత్త సెక్రటేరియట్‌లోని ఆరవ అంతస్థులో సీఎం కేసీఆర్ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఆయన అక్కడ ప్రత్యేక పూజల అనంతరం ఆసీనులవుతారు. ఆ తర్వాత పలు సంక్షేమ పథకాల ఫైళ్లపై ఆయన సంతకాలు చేస్తారని ప్రభుత్వ వర్గాలు చెబుతున్నాయి. గృహ లక్ష్మి పథకం కొనసాగింపు ఫైల్‌తో పాటు దళిత బంధు రెండో దశ, గొర్రెల పంపిణీ పథకం, పోడు భూములకు సంబంధించిన పట్టాల ఫైల్‌పై సీఎం కేసీఆర్ సంతకాలు చేస్తారు. అలాగే సెక్రటేరియట్‌లో అడుగు పెట్టిన తొలి రోజు పీఆర్సీ, పెన్షన్లకు సంబంధించిన ప్రకటన వెలువడుతుందని తెలుస్తున్నది.
గృహ లక్ష్మీ పథకం ద్వారా సొంత భూమి ఉన్న వారు ఇల్లు కట్టుకోవడానికి రూ.3 లక్షల సాయం అందించనున్నారు. అలాగే దళిత బంధు ద్వారా 1.30 లక్షల మందికి లబ్ధి చేకూరనున్నది. 1.55 లక్షల మంది పోడు వ్యవసాయదారులకు పట్టాలు, 3.5 లక్షల మంది లబ్ధిదారులకు గొర్రెల పంపిణీ చేయనున్నారు. తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేస్తోందో మరోసారి దేశానికి చాటి చెప్పాలనే ఉద్దేశంతో తొలి రోజు ఆయా ఫైల్స్‌పై సీఎం సంతకాలు చేస్తారని పార్టీ వర్గాలు అంటున్నాయి.
2019 అగస్టు నుంచి బీఆర్కే భవన్ తాత్కాలిక సచివాలయంగా సేవలు అందిస్తోంది. జులై 2020న పాత సెక్రటేరియట్ భవనాన్ని కూల్చేశారు. ప్రస్తుతం సీఎం తన కార్యకలాపాలన్నీ ప్రగతి భవన్ నుంచే చేస్తున్నారు. సీఎంవో కార్యాలయం కూడా అక్కడే ఉన్నది. కానీ, కొత్త సెక్రటేరియట్ ప్రారంభం తర్వాత సీఎం కేసీఆర్ ఇక్కడి నుంచే పాలన అందించనున్నారు.