Telugu Global
Telangana

కేసీఆర్ తో అట్లుంటది.. గంటలోనే జీవో విడుదల

ఆలయ అభివృద్ధికి గతంలో రూ.23 కోట్లు మంజూరు చేయగా, తాజాగా మరో రూ.7కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రాంతమంతా పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు.

కేసీఆర్ తో అట్లుంటది.. గంటలోనే జీవో విడుదల
X

సీఎం కేసీఆర్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరోసారి నిరూపించుకున్నారు. కామారెడ్డి జిల్లా బీర్కూర్ మండలం తిమ్మాపూర్ లోని వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్తున్న క్రమంలో.. గతంలో ఇచ్చిన హామీ నెరవేరిందా లేదా అని స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డిని అడిగారాయన. 66 ఎకరాల కేటాయింపు మిగిలి ఉందని చెప్పగానే.. వెంటనే చీఫ్ సెక్రటరీకి కి ఫోన్ చేసి జీవో విడుదల చేయాలని ఆదేశించారు కేసీఆర్. స్వామివారి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్ పాల్గొని, ఆ తర్వాత కృతజ్ఞత సభకు వచ్చే సమయానికి జీవో విడుదలైంది. గంటలోపే జీవో విడుదల చేసిన ఘనత సీఎం కేసీఆర్ కే చెల్లుతుందని అన్నారు స్థానిక ఎమ్మెల్యే, శాసన సభ స్పీకర్ పోచారం శ్రీనివాసులరెడ్డి. కేసీఆర్ మాటల మనిషి కాదు, చేతల మనిషి అని మరోసారి రుజువైందని చెప్పారు. ఇలాంటి నాయకత్వం దేశానికి అవసరం అని అన్నారు.

తిమ్మాపూర్‌ లోని శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి కల్యాణోత్సవంలో సీఎం కేసీఆర్‌ దంపతులు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి చెందిన తిమ్మాపూర్‌ వెంకటేశ్వరుడి సన్నిధికి రావడం సంతోషంగా ఉందన్నారు కేసీఆర్. ఈ ఆలయ అభివృద్ధికి గతంలో రూ.23 కోట్లు మంజూరు చేయగా, తాజాగా మరో రూ.7కోట్లు అదనంగా మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. తెలంగాణ ప్రాంతమంతా పంటలతో సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నానని చెప్పారు.


బాన్స్ వాడకు రూ.50కోట్లు

బాన్సువాడ నియోజకవర్గానికి రూ.50 కోట్లు మంజూరు చేస్తున్నట్టు ప్రకటించారు సీఎం కేసీఆర్. పోచారం వయసు పెరుగుతోందని, అయినా వదిలిపెట్టే ప్రసక్తే లేదని, బాన్సువాడకు ఆయన ఇంకా సేవ చేయాల్సిందేనని అన్నారు. తనకు కూడా 69 ఏళ్లు వచ్చాయని, ముసలోడిని అవుతున్నానంటూ సరదాగా వ్యాఖ్యానించారు కేసీఆర్. కేసీఆర్ వంటి విజన్ ఉన్న నాయకుడిని తన రాజకీయ జీవితంలో ఇంతవరకు చూడలేదన్నారు పోచారం శ్రీనివాసులరెడ్డి. ప్రాణం ఉన్నంత వరకు ఆయన నాయకత్వంలోనే పనిచేస్తామని చెప్పారు.

First Published:  1 March 2023 4:29 PM IST
Next Story