తుది దశకు ప్రచారం.. నేడు 4 సభల్లో కేసీఆర్ ప్రసంగం
ఈ రోజు సీఎం కేసీఆర్ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ఆయన పర్యటిస్తారు. అక్కడక్కడ వాతావరణం చల్లబడినా.. కేసీఆర్ సభలకు మాత్రం ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు స్థానిక నేతలు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
తెలంగాణ ఎన్నికల ప్రచారం తుది దశకు చేరుకుంది. ప్రచారానికింకా ఐదు రోజులే సమయం మిగిలుంది. ఈ ఐదు రోజుల్లో ఎవరెవరు ఎంత విస్తృతంగా పర్యటించారు, ప్రజలకు ఏ మేరకు అవగాహన కల్పించారనేది ప్రధాన అంశం కాబోతోంది. ఈ రోజు సీఎం కేసీఆర్ నాలుగు చోట్ల ప్రజా ఆశీర్వాద సభల్లో పాల్గొంటారు. మంచిర్యాల, రామగుండం, ములుగు, భూపాలపల్లిలో ఆయన పర్యటిస్తారు. అక్కడక్కడ వాతావరణం చల్లబడినా.. కేసీఆర్ సభలకు మాత్రం ఆటంకం లేకుండా ఏర్పాట్లు చేశారు స్థానిక నేతలు. భారీగా జనసమీకరణ చేస్తున్నారు.
రేపు భారీ బహిరంగ సభ..
హైదరాబాద్ లో రేపు భారీ బహిరంగ సభకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. రెండు విడతల్లో సీఎం కేసీఆర్, గ్రేటర్ మినహా మిగతా నియోజకవర్గాల్లో పర్యటిస్తూ వస్తున్నారు. గ్రేటర్ లో మంత్రి కేటీఆర్ రోడ్ షో లతో హోరెత్తించారు. ఇప్పుడు గ్రేటర్ పరిధిలోని అన్ని నియోజకవర్గాలకు కలిపి హైదరాబాద్ లో కేసీఆర్ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతున్నారు. జీహెచ్ఎంసీ పరిధిలోని 24 నియోజకవర్గాలకు కలిపి ఇక్కడ ఒకటే మీటింగ్ జరుగుతుంది. రేపు పరేడ్ గ్రౌండ్స్ లో సీఎం కేసీఆర్ సభ జరుగుతుంది. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఈ సభ ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. గ్రేటర్ లోని 24 నియోజకవర్గాల నుంచి వచ్చే పార్టీ శ్రేణుల వాహనాల పార్కింగ్ కు 24 ప్రాంతాలను గుర్తించామని, అక్కడ కూడా అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు.
హైదరాబాద్ సభ అనంతరం ఈనెల 26న ఖానాపూర్, జగిత్యాల, వేములవాడ, దుబ్బాకలో కేసీఆర్ సభలు జరుగుతాయి. 27న షాద్‌నగర్, చేవెళ్ల, అందోల్, సంగారెడ్డిలో జరిగే సభలకు కేసీఆర్ హాజరవుతారు. 28తో ప్రచారం ముగుస్తుంది. ఆ రోజు వరంగల్ (ఈస్ట్, వెస్ట్)తోపాటు తన సొంత నియోజకవర్గం గజ్వేల్ లో జరిగే ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొంటారు సీఎం కేసీఆర్.
♦