Telugu Global
Telangana

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగకు ముహూర్తం ఫిక్స్‌

ఈనెల 22న సీఎం కేసిఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తార‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు.

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పండుగకు ముహూర్తం ఫిక్స్‌
X

పేదల కోసం రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా, ఆధునాతన సౌకర్యాలతో హైదరాబాద్ శివారులోని కొల్లూరులో 15,660 డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను నిర్మించింది. ఈనెల 22న సీఎం కేసిఆర్ ప్రారంభించి లబ్ధిదారులకు పంపిణీ చేస్తార‌ని రాష్ట్ర రోడ్లు భవనాలు శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. కొల్లూరులో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ ప్రారంభోత్సవ ఏర్పాట్లను మంగళవారం అధికారులతో కలిసి మంత్రి పరిశీలించారు. ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. ముఖ్యమంత్రి రూట్ మ్యాప్‌పై చర్చించి పలు సూచనలు చేశారు.

కొల్లూరు డబుల్ బెడ్ రూమ్‌ల గృహ స‌ముదాయం ఆసియాలోనే అతిపెద్ద రెసిడెన్షియల్ కాంప్లెక్స్ గా నిలువనుందని మంత్రి తెలిపారు. మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతోనే ఈ నిర్మాణాలు సకల సౌకర్యాలతో పూర్తి అయ్యాయని చెప్పారు. పేదల ఆత్మ గౌరవ ప్రతీకగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల‌ను నిర్మిస్తున్నామన్నారు. గతంలో కాగితాల్లో ఇళ్లు చూపించి లక్షల రూపాయలు బిల్లులు డ్రా చేసుకునేవారని... కానీ నేడు పేదల కోసం పూర్తి ఉచితంగా డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు నిర్మిస్తున్నామన్నారు. గృహ సముదాయంలో 103 షాపింగ్ కాంప్లెక్స్ లు, కమ్యూనిటీ హాల్, పోలీస్ స్టేషన్, లిఫ్ట్‌లు, తాగునీరు, డ్రైనేజీ , రోడ్లు అన్ని రకాల మౌలిక‌ సదుపాయాలు ఉంటాయని మంత్రి వివరించారు. భవిష్యత్‌లో కొల్లూరులోని ఈ ప్రాంతం మున్సిపాలిటీ అయ్యే అవకాశం ఉందన్నారు. మంత్రితో పాటు హెచ్ఎండీఏ కమిషనర్ అరవింద్ కుమార్, జీహెచ్ఎంసీ కమిషనర్ లోకేష్ కుమార్, సైబరాబాద్ సీపీ స్టీఫెన్ రవీంద్ర, గృహ నిర్మాణ శాఖ అధికారులు, తదితరులు ఉన్నారు.

First Published:  20 Jun 2023 8:49 PM IST
Next Story