ముందుగానే బరిలోకి దిగనున్న బీఆర్‌ఎస్ అభ్యర్థులు..!
గత ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు తేరుకోకముందే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఒకేరోజు ప్రభుత్వాన్ని రద్దు చేసి, పార్టీ మీటింగ్‌లో అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈసారి కూడా ఒకేసారి ఇంచుమించు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్నారట.
తెలంగాణలో ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావాలనుకుటోంది బీఆర్‌ఎస్. అందుకోసం ప్రతిపక్షాలు తేరుకోకముందే బలమైన అభ్యర్థులను బరిలోకి దించాలని బీఆర్‌ఎస్ అధినేత భావిస్తున్నారు. ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఎన్నికల నాటికి ప్రజలకు పూర్తిస్థాయిలో చేరువయ్యే అవకాశం ఉంటుందని కేసీఆర్ భావిస్తున్నారు. ప్రకటించిన అభ్యర్థుల్లో ఎవరి పట్ల అయినా ప్రజల నుంచి పాజిటివ్ రెస్పాన్స్ రాకపోతే చివరి నిమిషంలో అభ్యర్థిని మార్చేలా కూడా అధినేత ప్లాన్ రూపొందించారట. ఇప్పటికే జిల్లాల వారీగా ఎవరికి టికెట్లు ఇవ్వొచ్చనే విషయంలో ముఖ్యమంత్రి కసరత్తు చేసినట్లు తెలుస్తోంది.
కాంగ్రెస్ దూకుడును ముందే పసిగట్టిన బీఆర్‌ఎస్ అధినేత గెలుపు గుర్రాలపై ఫోకస్ పెంచారు. సర్వేల ఆధారంగా సిట్టింగ్ ఎమ్మెల్యేలో మళ్లీ గెలిచే అవకాశం ఉన్నవారి జాబితాను సిద్దం చేస్తున్నట్లు తెలుస్తోంది. కొన్ని స్థానాల్లో సిట్టింగ్‌లను మార్చి ప్రజాదరణ గల కొత్త అభ్యర్థులను బరిలోకి దించాలనే కేసీఆర్ ప్లాన్. అన్ని నియోజకవర్గాలకు మూడు నెలల ముందే అభ్యర్థులను ప్రకటించి ప్రజల్లోకి వదలాలనుకుంటున్నారు.
గత ఎన్నికల్లోనూ ప్రతిపక్షాలు తేరుకోకముందే కేసీఆర్ ముందస్తుకు వెళ్లారు. ఒకేరోజు ప్రభుత్వాన్ని రద్దు చేసి, పార్టీ మీటింగ్‌లో అభ్యర్థుల పేర్లు ప్రకటించారు. ఈసారి కూడా ఒకేసారి ఇంచుమించు అన్ని స్థానాలకు అభ్యర్థులను ప్రకటించాలనుకుంటున్నారట. బీఆర్‌ఎస్ చాలా అసెంబ్లీ స్థానాల్లో ఇద్దరు ముగ్గురు ఆశావహులు ఉన్నారు. అలాంటి స్థానాల్లో సర్వేల ఆధారంగా ప్రజాదరణ ఉన్నవారికే టికెట్ ఇవ్వాలనుకుంటున్నారు కేసీఆర్.
జూలై నెలాఖరు వరకు బీఆర్‌ఎస్ అభ్యర్థుల జాబితాను ప్రకటించే అవకాశం ఉందని గులాబీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. తొలి జాబితాలో సుమారు 90 మంది అభ్యర్థుల పేర్లు ఉండే అవకాశం ఉందట. అయితే ఈసారి చాలామంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు అవకాశం దక్కదనే ప్రచారం జరుగుతోంది. దాదాపు ఇరవై నుంచి ముప్పై మందిని మార్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు బలమైన నాయకులున్న స్థానాలు, పోటీ ఎక్కువగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను చివర్లో ప్రకటించే అవకాశం ఉంది. కొందరు ఆశావహులకు కార్పొరేషన్ చైర్మన్ పదవులు లాంటివి ఆఫర్ చేయాలనుకుంటున్నారట కేసీఆర్. అసంతృప్త నేతలను బుజ్జగించడం, సాధ్యంకాని పక్షంలో సాగనంపాలనుకుంటున్నారట.
ముందస్తుగా అభ్యర్థులను ప్రకటించడం ద్వారా ఇటు ప్రజలకు చేరువవ్వడంతో పాటు, అసంతృప్తులపైనా స్పష్టత వస్తుందని కేసీఆర్ భావిస్తున్నారు. మరి బీఆర్‌ఎస్ అధినేత వ్యూహం ఎంతమేరకు ఫలిస్తుందో చూడాలి.