రైతుబంధు రూ.16 వేలు చేస్తాం... - మహేశ్వరం సభలో సీఎం కేసీఆర్
ధరణి పోర్టల్‌ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసి.. భూమాత తెస్తామంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు.. భూమేత అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో రైతుబంధు పథకాన్ని తీసుకొచ్చి ప్రతి రైతు ఇంట వెలుగులు నింపామని రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో గురువారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం మాట్లాడారు. రైతులకు 24 గంటల నాణ్యమైన విద్యుత్ అందిస్తున్నామని ఆయన ఈ సందర్భంగా చెప్పారు. రైతుబంధు పథకాన్ని పుట్టించిందే కేసీఆర్, బీఆర్‌ఎస్ ప్రభుత్వమని ఆయన గుర్తుచేశారు. రైతుబంధు లాంటి పథకాలతో వ్యవసాయదారుల కుటుంబాలు కళకళలాడుతున్నాయని చెప్పారు. పీసీసీ మాజీ అధ్యక్షుడు మాత్రం.. రైతుబంధు దుబారా అని చెబుతున్నారని సీఎం విమర్శించారు. కానీ.. తాము మళ్లీ అధికారంలోకి వస్తే రైతుబంధు ఎకరానికి రూ.16 వేలు చేస్తామని ఈ సందర్భంగా కేసీఆర్ తేల్చిచెప్పారు. రైతులకు 24 గంటల విద్యుత్ వృథా అని పీసీసీ అధ్యక్షుడు చెబుతున్నారని, రైతులకు 3 గంటల విద్యుత్ సరఫరా సరిపోతుందని ఆయన అంటున్నారని గుర్తుచేశారు. ధరణి పోర్టల్‌ను తీసుకెళ్లి బంగాళాఖాతంలో వేసి.. భూమాత తెస్తామంటున్నారని చెప్పారు. కాంగ్రెస్ తెచ్చేది భూమాత కాదు.. భూమేత అని కేసీఆర్ ఎద్దేవా చేశారు.
కందుకూరుకు మెడికల్ కళాశాల రావడానికి మంత్రి సబితా ఇంద్రారెడ్డి కృషే కారణమని సీఎం కేసీఆర్ తెలిపారు. మహేశ్వరం నియోజకవర్గంలో నాలాల అభివృద్ధి జరిగిందంటే దానికి కారణం కూడా ఆమేనని చెప్పారు. ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ త్వరలోనే పైప్‌లైన్ రాబోతోందని, అది అందుబాటులోకి వస్తే మహేశ్వరం ప్రజలకు తాగునీటి సమస్యే ఉండదని తెలిపారు. ఫాక్స్‌కాన్ పరిశ్రమతో లక్ష మంది యువతకు ఉద్యోగాలు వస్తాయన్నారు.
ఆర్థిక క్రమశిక్షణ పాటిస్తున్నందునే రాష్ట్రంలో సంపద పెరిగిందని కేసీఆర్ తెలిపారు. రాష్ట్ర సంపదను బీఆర్‌ఎస్ పెంచితే.. దానిని తుంచడానికి కాంగ్రెస్ మళ్లీ కుయుక్తులు పన్నుతోందని మండిపడ్డారు. కాంగ్రెస్ తీరు వంటలు చేసి పెట్టండి.. మేము వడ్డిస్తామన్న చందంగా ఉందని సీఎం విమర్శించారు. మళ్లీ అధికారంలోకి రాగానే అందరి పింఛన్ సొమ్ము పెంచుతామని స్పష్టం చేశారు. ఓటు అనే బ్రహ్మాండమైన ఆయుధాన్ని జాగ్రత్తగా ఆలోచించి ఉపయోగించాలని ఓటర్లను కోరారు. మీ ఓటు ఐదేళ్ల రాష్ట్ర భవిష్యత్‌ను నిర్ణయిస్తుంది.. అభ్యర్థిని, వాళ్ల వెనక ఉన్న పార్టీని దృష్టిలో ఉంచుకొని ఓటు వేయాలి.. అంటూ కేసీఆర్ పిలుపునిచ్చారు.
♦