Telugu Global
Telangana

రైతు రుణమాఫీ విషయంలో ఏనుగు వెళ్లింది, తోక చిక్కింది..

టికెట్ ఇవ్వనంత మాత్రాన రాజయ్యను పక్కనపెట్టబోమని, ఆయన కూడా మంచి హోదాలోనే ఉంటారని హామీ ఇచ్చారు సీఎం కేసీఆర్.

రైతు రుణమాఫీ విషయంలో ఏనుగు వెళ్లింది, తోక చిక్కింది..
X

కరోనా వల్ల ఆదాయం తగ్గడంతో రైతు రుణమాఫీ కాస్త ఆలస్యమైందని వివరించారు సీఎం కేసీఆర్. అయినా కూడా ఆ హామీ పూర్తిగా నెరవేర్చే ప్రయత్నం చేశామని చెప్పారు. రుణమాఫీ విషయంలో ఏనుగు వెళ్లిందని, తోక చిక్కిందని అన్నారు. దాన్ని కూడా పూర్తి చేస్తామన్నారు. మరోవైపు రుణమాఫీ పూర్తికాకుండా కాంగ్రెస్ పార్టీ అడ్డుపడిందని ఆరోపించారు కేసీఆర్. ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేసి ఇవ్వొద్దని కాంగ్రెస్ నేతలే చెప్పారని, రుణమాఫీ కాలేదని తిరిగి మనపైనే ఆరోపణలు చేస్తున్నారని, ప్రజలు ఈ విషయాలన్నీ ఆలోచించాలన్నారు. స్టేషన్ ఘన్ పూర్ లో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న కేసీఆర్ వందశాతం మిగతావారికి కూడా రుణమాఫీ పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు.


అటు రాజయ్య - ఇటు శ్రీహరి..

స్టేషన్ ఘన్ పూర్ లో ఈసారి సిట్టింగ్ ఎమ్మెల్యే రాజయ్యను మార్చి, కడియం శ్రీహరికి బీఆర్ఎస్ టికెట్ కేటాయించారు సీఎం కేసీఆర్. టికెట్ ఇవ్వనంత మాత్రాన రాజయ్యను పక్కనపెట్టబోమని, ఆయన కూడా మంచి హోదాలోనే ఉంటారని హామీ ఇచ్చారు. మంత్రిగా ఉన్నప్పుడు, లేనప్పుడు కూడా కడియం శ్రీహరి ప్రజల కోసమే కొట్లాడారని చెప్పారు. ఆయన్ను గెలిపిస్తే ఘన్ పూర్ బ్రహ్మాండంగా అభివృద్ధి చెందుతుందని భరోసా ఇచ్చారు. ఆయన కోరికలన్నీ నెరవేరుస్తామని అన్నారు కేసీఆర్. ఆర్టీసీ బిల్ పాస్ చేసినా, గవర్నర్ ఆలస్యం చేయడం వల్ల అది పూర్తి కాలేదని, ఎన్నికలైపోయాక వెంటనే ఆర్టీసీ ఉద్యోగుల్ని ప్రభుత్వంలో కలుపుకొంటామన్నారు కేసీఆర్.

స్టేష‌న్ ఘ‌న్‌పూర్ నియోజ‌క‌వ‌ర్గంలోని మాణిక్య‌పురం అనే గ్రామంలో చుక్క స‌త్త‌య్య అనే పేరుమోసిన ఒగ్గు క‌ళాకారుడు ఉండేవాడని, సాగునీటికోసం ఆయన పొలంలో 58 బోర్లు వేశాడని చెప్పారు కేసీఆర్. తన ఒగ్గు క‌థ‌ల మీద వ‌చ్చిన పైస‌ల‌న్నీ ఆ బోరు బొక్క‌ల్లోనే పోశారన్నారు. 58 బోర్లు వేస్తే చుక్క నీరు రాలేదని చెప్పారు. దేవాదుల ప్రాజెక్ట్ పనులు ముందుకు సాగకపోతే.. అక్కడికి వెళ్లి ఎమ్మెల్యే రాజయ్య పిండం పెట్టి వ‌చ్చాడని గుర్తు చేశారు. ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవని, ఎక్కడ చూసినా సాగునీరు ఉందని, నీటి తీరువా కూడా లేకుండా ఉచితంగా పంపిణీ చేస్తున్నామని, బోర్లు వేసుకున్నా ఉచిత కరెంటుతో రైతులకు నష్టం లేదని చెప్పారు కేసీఆర్.


First Published:  20 Nov 2023 4:19 PM IST
Next Story