Telugu Global
Telangana

దద్దమ్మ కాంగ్రెస్.. చేతగాక సింగరేణిని ముంచింది

కార్మికులకు ఇచ్చే పెర్క్స్ పై పన్ను లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కులు కాపాడతామని చెప్పారు కేసీఆర్.

దద్దమ్మ కాంగ్రెస్.. చేతగాక సింగరేణిని ముంచింది
X

సింగరేణి విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం దద్దమ్మలా వ్యవహరించిందని మండిపడ్డారు సీఎం కేసీఆర్. 134 ఏళ్ల క్రితం సింగరేణి సంస్థ పుట్టిందని, ఇది తెలంగాణ సొంత కంపెనీ అని తెలంగాణ ప్రజల ఆస్తి అని అన్నారు కేసీఆర్. అలాంటి కంపెనీని ఇక్కడి నాయకులు చేతగాని దద్దమ్మల్లాగా సమైక్య నాయకుల చేతుల్లో పెట్టారని, వారు కేంద్రం దగ్గర అప్పులు తెచ్చారని, అలా సింగరేణిపై 600 కోట్ల రూపాయల మారటోరియం ఏర్పడిందని వివరించారు కేసీఆర్. ఆ అప్పులు కట్టడం చేతగాక చేతులెత్తేసి కేంద్రానికి 49శాతం వాటా పుట్టించారన్నారు. మన సింగరేణి మనకు వందశాతం ఉండాల్సిందని, అలా లేకుండా చేసిందికాంగ్రెస్సేనని విమర్శించారు. మున‌గ‌డానికి సిద్ధంగా ఉన్న సింగ‌రేణిని కాపాడి, రూ. 2,200 కోట్ల లాభాల్లోకి తీసుకుపోయామ‌ని చెప్పారు కేసీఆర్. రామగుండం ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కోరుకంటి చందర్ ని గెలిపించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.


సింగరేణిలో దీపావళి బోనస్, లాభాల కోటా కలిసి దాదాపు వెయ్యి కోట్ల రూపాయలు పంపిణీ చేశామని చెప్పారు సీఎం కేసీఆర్. సింగరేణి చరిత్రలోనే ఎప్పుడూ ఇలా చేయలేదన్నారు. ప్రతి కార్మికుడికి దాదాపు 2 లక్షల రూపాయలు వచ్చాయన్నారు. కార్మికుల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. కార్మికులకు ఇచ్చే పెర్క్స్ పై పన్ను లేకుండా చేస్తామని హామీ ఇచ్చారు. కార్మికుల హక్కులు కాపాడతామని చెప్పారు కేసీఆర్.

సింగ‌రేణి ఎండీని ఆస్ట్రేలియా, ఇండోనేషియాకు పంపించి అక్కడి గనులు తీసుకునేందుకు ప్రయత్నం చేశామని.. అంతర్జాతీయంగా బొగ్గు ధరలు పడిపోవడంతో ప్రస్తుతానికి ఆ ప్రయత్నం ఆపామని చెప్పారు కేసీఆర్. సంద‌ర్భం వ‌స్తే విదేశాల్లో కూడా విస్తరిస్తామన్నారు. సింగ‌రేణి తెలంగాణ కొంగు బంగారం అని, అన్నం పెట్టిన త‌ల్లి అని చెప్పారు. సింగ‌రేణిని మ‌రింత విస్త‌రించుకుంటామన్నారు.


First Published:  24 Nov 2023 11:40 AM GMT
Next Story