Telugu Global
Telangana

పదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తారా..?

కాక‌తీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు ఇక్క‌డ‌కు రావ‌డం చాలా సంతోషం అన్నారు కేసీఆర్. అడిష‌న‌ల్‌ కోర్టు అవసరం అని కోరారని, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడి కోర్టు తెప్పించే ప్ర‌య‌త్నం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.

పదేళ్ల కష్టాన్ని బూడిదలో పోసిన పన్నీరు చేస్తారా..?
X

తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్ర‌గామిగా నిలిపేందుకు ఈ ప‌దేళ్లు ఎంతో క‌ష్టప‌డ్డామని, త‌ల‌స‌రి ఆదాయంలో రాష్ట్రాన్ని నెంబర్-1 గా నిలిపామని చెప్పారు సీఎం కేసీఆర్. ఇప్పుడు ఎవ‌డో వ‌స్తే, వాడికి ఓటు వేస్తే.. ఈ ప‌దేళ్లు మనం ప‌డ్డ క‌ష్టం బూడిద‌లో పోసిన ప‌న్నీరు అవుతుందని హెచ్చరించారు. అందుకే ఆలోచించి ఓటు వేయాలన్నారు. ప‌ర‌కాల నియోజ‌క‌వ‌ర్గంలో ఏర్పాటు చేసిన ప్ర‌జా ఆశీర్వాద‌ సభలో పాల్గొన్న సీఎం.. చల్లా ధ‌ర్మారెడ్డిని మరోసారి భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు.


ప్ర‌గ‌తి కొన‌సాగాలంటే..

పదేళ్లు కష్టపడి సాధించుకున్న ప్రగతి కొనసాగాలంటే తెలంగాణలో బీఆర్ఎస్సే అధికారంలో ఉండాలని చెప్పారు సీఎం కేసీఆర్. ఒక‌ప్పుడు క‌రువుతో గొడ‌గొడ ఏడ్చిన తెలంగాణ ఇది, భీవండికి బ‌తుక‌పోయిన తెలంగాణ ఇది.. అని చెప్పారు. అనేక మంచి కార్య‌క్ర‌మాలు చేప‌ట్టిన త‌ర్వాత ఇవాళ 3 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించుకుంటున్నామని, మిగిలిన చిన్న చిన్న ప్రాజెక్టులు పూర్త‌యితే 4 కోట్ల మెట్రిక్ ట‌న్నుల ధాన్యం పండించేలా దేశానికే అన్నం పెట్టే తెలంగాణ త‌యారవుతుందన్నారు కేసీఆర్.

గ‌తంలో ప్రాజెక్టు కింద నీళ్లు పారితే ప‌న్నులు వ‌సూలు చేసేవారని, ఈరోజు నీటి తీరువా ప‌న్ను లేదని, బ‌కాయిలు కూడా ర‌ద్దు చేశామని చెప్పారు సీఎం కేసీఆర్. 24 గంట‌ల నాణ్య‌మైన క‌రెంట్, రైతుబంధు, రైతు బీమా ఇస్తున్నామన్నారు. మద్దతు ధరతో ధాన్యం మొత్తాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేస్తోందని చెప్పారు. ప‌ర‌కాల ఎమ్మెల్యే చ‌ల్లా ధ‌ర్మారెడ్డి ఉత్త‌మ‌మైన మ‌నిషి అని, ప్ర‌జ‌ల ఫీలింగ్ ఉన్న మ‌నిషి అని ప్ర‌శంసించారు. అలాంటి మంచి అభ్య‌ర్థిని మళ్లీ గెలిపిస్తే రైతుబంధు 16 వేలు అవుతుందని, 24 గంట‌ల క‌రెంట్ ఉంటుందని చెప్పారు. అన్ని విధాలా ప‌ర‌కాల అభివృద్ధి జ‌రుగుతుందన్నారు.

కాక‌తీయ మెగా టెక్స్ టైల్స్ పార్కు ఇక్క‌డ‌కు రావ‌డం చాలా సంతోషం అన్నారు కేసీఆర్. చాలా మంది పిల్ల‌ల‌కు ఉద్యోగాలు వ‌స్తాయ‌ని ఎమ్మెల్యే చెబుతున్నారని, అడిష‌న‌ల్‌ కోర్టు అవసరం అని కోరారని, హైకోర్టు చీఫ్ జ‌స్టిస్‌తో మాట్లాడి కోర్టు తెప్పించే ప్ర‌య‌త్నం చేస్తానని హామీ ఇచ్చారు కేసీఆర్.

First Published:  17 Nov 2023 10:06 PM IST
Next Story