Telugu Global
Telangana

కమ్యూనిస్ట్ సోదరులకు కేసీఆర్ మనవి..

నల్గొండ జిల్లా వ‌ట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా అని, న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి ఉద్యమాలు చేసిన గ‌డ్డ‌ అని గుర్తు చేశారు సీఎం కేసీఆర్. బాగా చైత‌న్యం ఉండే ప్రాంత‌మ‌ని చెప్పారు.

కమ్యూనిస్ట్ సోదరులకు కేసీఆర్ మనవి..
X

ప్రజా ఆశీర్వాద సభల్లో బీజేపీ, కాంగ్రెస్ పై తీవ్ర విమర్శలు చేస్తున్న సీఎం కేసీఆర్.. కమ్యూనిస్ట్ ల గురించి మాత్రం ఎక్కడా మాట్లాడలేదు. కానీ నకిరేకల్ సభలో ఆయన తొలిసారిగా కమ్యూనిస్ట్ లపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. సీపీఐ కాంగ్రెస్ కి మద్దతిస్తున్నా, సీపీఎం సొంతంగా బరిలో ఉన్నా కూడా.. నకిరేకల్ లో మాత్రం కమ్యూనిస్ట్ సోదరులు ఆలోచించి ఓటు వేయాలని, బీఆర్ఎస్ అభ్యర్థి చిరుమర్తి లింగయ్యకు మద్దతు తెలపాలని పిలుపునిచ్చారు. "ఇక్కడ మీరు పోటీలో లేరు. మీ ఓట్లు ఎవ‌రికో వేసి మోరిలో ప‌డేయ‌కండి. ప్ర‌గ‌తికాముక‌మైన బీఆర్ఎస్ పార్టీకి ద‌య‌చేసి వేయండి. లింగ‌య్య‌కు మ‌ద్ద‌తు ఇవ్వండి." అని ప్రజా ఆశీర్వాద సభలో కోరారు సీఎం కేసీఆర్.


నకిరేకల్ నియోజకవర్గంలో పోటీ ఆసక్తికరంగా మారింది. 2014లో చిరుమర్తి లింగయ్య కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసి, బీఆర్ఎస్ అభ్యర్థి వేముల వీరేశం చేతిలో ఓడిపోయారు. 2018లో మళ్లీ కాంగ్రెస్ టికెట్ పై పోటీ చేసిన లింగయ్య బీఆర్ఎస్ అభ్యర్థి వీరేశంపై గెలిచారు. ఆ తర్వాత వెంటనే లింగయ్య బీఆర్ఎస్ లో చేరారు. ఈసారి బీఆర్ఎస్ టికెట్ లింగయ్యకే దక్కింది. దీంతో వేముల వీరేశం కాంగ్రెస్ లోకి వెళ్లారు. కాంగ్రెస్ టికెట్ పై ఇప్పుడు నకిరేకల్ లో పోటీ చేస్తున్నారు. అంటే ప్రత్యర్థులు అలాగే ఉన్నారు కానీ, వారి గుర్తులే మారిపోయాయి.

కాంగ్రెస్‌ పార్టీ తాము గెలిస్తే తెలంగాణ ఇస్తామని 2004లో అప్పటి టీఆర్ఎస్‌ తో పొత్తు పెట్టుకుందని, ఆ తర్వాత ఎన్నికల్లో గెలిచి ఇచ్చిన మాట తప్పిందని విమర్శించారు సీఎం కేసీఆర్. ఉమ్మడి నల్గొండ జిల్లా వ‌ట్టికోట ఆళ్వారు స్వామి పుట్టిన జిల్లా అని, న‌ర్రా రాఘ‌వ‌రెడ్డి ఉద్యమాలు చేసిన గ‌డ్డ‌ అని గుర్తుచేశారు. బాగా చైత‌న్యం ఉండే ప్రాంత‌మ‌ని చెప్పారు. ఆ చైతన్యం ఎన్నికల్లో చూపించాలన్నారు. ఎన్నికలు రాగానే గడబిడ కావొద్దని, ఎవరో చెప్పింది నమ్మి ఓటేయొద్దని అన్నారు. బాగా ఆలోచించి ఓటు వేయాలని పిలుపునిచ్చారు సీఎం కేసీఆర్.

First Published:  20 Nov 2023 1:11 PM
Next Story