Telugu Global
Telangana

ములుగు ఎమ్మెల్యే సీతక్కపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు

లాస్ట్‌ టైమ్‌ ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించకపోతే తానేమీ అలగలేదని, ఈసారి మాత్రం నాగజ్యోతిని గెలిపించకపోతే పంచాయితీ పెట్టుకుంటానన్నారు కేసీఆర్. ములుగు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంలో ఉండే పార్టీని గెలిపించాలన్నారు.

ములుగు ఎమ్మెల్యే సీతక్కపై కేసీఆర్ కీలక వ్యాఖ్యలు
X

ములుగు ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న సీఎం కేసీఆర్ స్థానిక ఎమ్మెల్యే సీతక్కపై కీలక వ్యాఖ్యలు చేశారు. "ఆమె ఏ పార్టీలో అయినా ఉండొచ్చుగాక.. ముఖ్యమంత్రిని కలవాలి, ప్రభుత్వంతో మాట్లాడాలి, పనులు చేయించుకోవాలి.. కానీ ఆమె ఏనాడు ప్రభుత్వంతో మాట్లాడలేదు. మాకు తోచినవి, తెలిసినవి, మా పార్టీవాళ్లు చెప్పినవి చేశాను. ఆమె మాత్రం ఏదీ అడగదు." అని అన్నారు కేసీఆర్. ఇక్కడ బీఆర్‌ఎస్‌ అభ్యర్థి బడే నాగజ్యోతి ఎమ్మెల్యే అయితే ములుగు ఓ జ్యోతిలా వెలుగుతుందని చెప్పారు.


కాంగ్రెస్‌ పాలనలో మంచినీరు ఇచ్చారా? కరెంటు ఇచ్చారా? రైతుబంధు ఇచ్చారా? పోడు భూములు పంచారా? అని ప్రశ్నించారు సీఎం కేసీఆర్. జరగాల్సింది వాదులాటలు కాదని, ప్రజల క్షేమం అని చెప్పారు. కాంగ్రెస్ వాళ్లు ఇందిరమ్మ రాజ్యం తెస్తామంటున్నారని.. ఇందిరమ్మ రాజ్యంలో ఏమున్నాయని, ఎన్ కౌంటర్లు, కాల్చి చంపుకోవడాలే కదా అని అన్నారు. ఎమర్జెన్సీలు పెట్టి జైళ్లలో వేసేవారని, గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యం ఉన్నప్పుడే బడే నాగజ్యోతి తండ్రి ఉద్యమాల్లోకి పోయి అమరుడయ్యారని, ప్రజల కోసం ప్రాణాలు అర్పించారని, అలాంటి తండ్రి బిడ్డను మనం గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. ములుగు ప్రజలే నా తల్లిదండ్రులు అని చెప్పిన నాగజ్యోతిని గెలిపించుకోవాల్సిన బాధ్యత ప్రజలందరిపై ఉందన్నారు.

నాగజ్యోతిని గెలిపించకుంటే..?

లాస్ట్‌ టైమ్‌ ములుగులో బీఆర్ఎస్ అభ్యర్థిని గెలిపించకపోతే తానేమీ అలగలేదని, ఈసారి మాత్రం నాగజ్యోతిని గెలిపించకపోతే పంచాయితీ పెట్టుకుంటానన్నారు కేసీఆర్. ములుగు అభివృద్ధి కావాలంటే ప్రభుత్వంలో ఉండే పార్టీని గెలిపించాలన్నారు. అప్పుడే లాభం జరుగుతుందని, పనులు ఎక్కువ జరుగుతాయన్నారు. నాగజ్యోతిని గెలిపిస్తే ఇక్కడే రెండు రోజులు క్యాంప్‌ లో ఉంటానని హామీ ఇచ్చారు కేసీఆర్. ఎక్కడ ఏం అవసరాలున్నయో వంద శాతం చేసే బాధ్యత నాది అని చెప్పారు.

First Published:  24 Nov 2023 6:13 PM IST
Next Story