Telugu Global
Telangana

మంథని ఈసారి మనదే.. పుట్ట మధుకి ధైర్యం చెప్పిన కేసీఆర్

మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌ రోడ్డును ఎవరూ పూర్తి చేయలేదని. పుట్ట మధు వచ్చిన తర్వాతే తన వెంటపడి ఆ పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు సీఎం కేసీర్.

మంథని ఈసారి మనదే.. పుట్ట మధుకి ధైర్యం చెప్పిన కేసీఆర్
X

మంథని నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ ఖాతాలో ఉంది. 2014లో ఇక్కడ బీఆర్ఎస్ అభ్యర్థి పుట్ట మధు గెలిచినా, 2018లో ఆ స్థానంలో కాంగ్రెస్ నేత దుద్దిళ్ల శ్రీధర్ బాబు ఎమ్మెల్యే అయ్యారు. ఇప్పుడు పోరు వారిద్దరి మధ్య రసవత్తరంగా సాగే అవకాశముంది. అయితే ఈసారి పుట్ట మధు విజయం ఖాయమని తేల్చి చెప్పారు కేసీఆర్. మంథని ప్రజా ఆశీర్వాద సభలో పాల్గొన్న ఆయన, గెలుపుపై అనుమానం పెట్టుకోవద్దని పుట్ట మధుకి సూచించారు.


కొంతమంది నాయకుల్ని పక్క పార్టీల వాళ్లు కొనుక్కుపోతున్నారని పుట్ట మ‌ధు అధైర్య పడ్డారని, కానీ వారి వల్ల నష్టమేమీ జరగదని చెప్పారు కేసీఆర్. గతంలో క‌రీంనగర్ ఎన్నికలప్పుడు కూడా ఇలాగే జరిగిందని, నాయకులు అమ్ముడుపోయినా ప్రజల్లో చైతన్యం ఉందని, పైసలకోసం వారు మోసపోరని వివరించారు. మంథనిలో కూడా అదే జరుగుతుందని భరోసా ఇచ్చారు కేసీఆర్. బీఆర్ఎస్ అధికారం చేపట్టి, ఎమ్మెల్యేగా వేరే పార్టీ నేతలు ఉంటే ప్రజలకు లాభమా అని ప్రశ్నించారు. గ‌వ‌ర్న‌మెంట్ ఉన్న ఎమ్మెల్యేనే రావాలని, అప్పుడే నియోజకవర్గానికి లాభం జ‌రుగుతుందన్నారు. అధికార పార్టీకి చెందిన నాయ‌కుల‌ను సంతలో ప‌శువుల‌ను కొన్న‌ట్టు కొంటారా..? అని కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తారు సీఎం కేసీఆర్. ఉన్న తెలంగాణ‌ను ఊడ‌గొట్టి, 58 ఏళ్లు మ‌న గోస పోసుకున్న కాంగ్రెస్ పార్టీని చిత్తుగా ఓడించాల‌ని ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చారు.

మంథనిలో పీవీ నర్సింహారావు హయాంలో మొదలుపెట్టిన రింగ్‌ రోడ్డును ఎవరూ పూర్తి చేయలేదని. పుట్ట మధు వచ్చిన తర్వాతే తన వెంటపడి ఆ పనులు పూర్తి చేశారని గుర్తు చేశారు సీఎం కేసీర్. నియోజకవర్గంలో మారుమూల ప్రాంతాలకు కూడా ఆయన రోడ్లు వేయించారని, ఆయన్ను గత ఎన్నికల్లో మీరు ఓడించడం కరెక్ట్ కాదు కదా అన్నారు. ఈసారి కచ్చితంగా గెలిపించాలన్నారు. మిగతా పార్టీలకు హైకమాండ్ లు ఢిల్లీలో ఉంటాయని, బీఆర్ఎస్ కి మాత్రం హైకమాండ్ తెలంగాణ ప్రజలేనని చెప్పారు. అందరి మధ్య ఉండే పుట్ట మధుని గెలిపించాలన్నారు కేసీఆర్.

First Published:  7 Nov 2023 6:03 PM IST
Next Story